Karnataka: కర్ణాటకలోని తుమకూరు జిల్లా జాతీయ రహదారిపై శనివారం ఓ భయంకరమైన ఘటనా చోటుచేసుకుంది. ఒకప్పుడు ప్రేమించి, ఆ తర్వాత మనస్పర్థలతో దూరమైన ఓ యువతిని బలవంతంగా కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు.. కదులుతున్న కారులోనే ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఆ ప్రమాదం నుంచి ఆమె చాకచక్యంగా తప్పించుకుని కారులోంచి కిందకు దూకేయగా.. మరుక్షణమే ఆ కారు భారీ పేలుడుతో నిప్పుల కొలిమిగా మారింది. ఈ ఘోర ప్రమాదంలో కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్ర (30) అనే యువకుడు కారులోనే సజీవ దహనమయ్యాడు.
పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని జయనగర్‌లో ఓటీ (OT) టెక్నీషియన్‌గా పనిచేస్తున్న యువతి, నాగేంద్ర గతంలో ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల వ్యక్తిగత విభేదాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. ఆ యువతి నాగేంద్ర ఫోన్ నంబర్‌ను కూడా బ్లాక్ చేసింది. దీనిపై తీవ్ర కక్ష పెంచుకున్న నాగేంద్ర.. శనివారం ఉదయం బెంగళూరులోని ఆమె నివాసానికి వెళ్లి గొడవపడ్డాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా ఒక ఉబెర్ (Uber) క్యాబ్‌లోకి నెట్టి కిడ్నాప్ చేశాడు. కుమార్తె కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు జయనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క్యాబ్‌లో అంకోలా వైపు వెళ్తుండగా, నిన్ను చంపి నేను కూడా చచ్చిపోతానంటూ నాగేంద్ర ఆమెను తీవ్రంగా బెదిరించాడు. అంతేకాకుండా తన వద్ద ఉన్న ఓ పేలుడు పదార్థాన్ని కూడా ఆమెకు చూపించాడు. జాతీయ రహదారి-48 పై తుమకూరు జిల్లా సిరా తాలూకాలోని జోగిహళ్లి సమీపానికి రాగానే, నాగేంద్ర కదులుతున్న కారులోనే ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన క్యాబ్ డ్రైవర్ ప్రవీణ్ వెంటనే వాహనాన్ని ఆపాడు. ఆ క్షణంలోనే యువతి కారు డోర్ లాక్ తెరిచి బయటకు దూకేసి ప్రాణాలు దక్కించుకుంది.
ఆమె కిందకు దూకిన మరుక్షణమే కారులో ఒక్కసారిగా శక్తివంతమైన పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. కారులోనే చిక్కుకుపోయిన నాగేంద్ర సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంలో గాయపడిన యువతిని, క్యాబ్ డ్రైవర్ ప్రవీణ్‌ను వెంటనే తుమకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ భారీ పేలుడు కారణంగా బిజీగా ఉండే ఆ హైవేపై కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనపై తుమకూరు ఎస్పీ అశోక్ కె.వి. తెలిపిన వివరాల ప్రకారం.. నాగేంద్ర తన వెంట బాంబు లాంటి పేలుడు పదార్థాన్ని తెచ్చుకున్నాడని, అతడే ఉద్దేశపూర్వకంగా ఈ పేలుడుకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కారు శిథిలాల నుంచి పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అసలు నాగేంద్ర ఆ బాంబును ఎక్కడి నుంచి తెచ్చాడు? అది ఎలా పేలింది? అనే కోణంలో కల్లంబెల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

