Karnataka: కర్ణాటకలో పాఠశాల విద్యార్థులను మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శివమొగ్గ జిల్లాకు చెందిన ఈ కేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో బయటకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం చర్య తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. వైరల్ అయిన వీడియోలో, కొంతమంది పాఠశాల విద్యార్థులు టాయిలెట్‌ను శుభ్రం చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నెలలో కర్నాటకలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం.
Read Also: UP Shocker: పాటలు వినడానికి మొబైల్ అడిగినందుకు.. భర్త కంట్లో కత్తెరతో పొడిచేసిన భార్య
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మరుగుదొడ్లను శుభ్రం చేసిన ఘటన చోటుచేసుకుంది. శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థులతో బలవంతంగా మరుగుదొడ్లు శుభ్రం చేయించారు. అయితే విద్యాశాఖ అధికారులు ప్రిన్సిపాల్‌తో మాట్లాడగా.. విద్యార్థులను కేవలం నీళ్లు పోయమని మాత్రమే చెప్పినట్లు, మరుగుదొడ్లు శుభ్రం చేయమని విద్యార్థులను ఆదేశించలేదని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులు టాయిలెట్లను శుభ్రం చేస్తున్న 10 సెకన్ల వీడియోను అందుకున్న విద్యాశాఖ, విచారణ కోసం సీనియర్ అధికారుల బృందాన్ని సంబంధిత పాఠశాలకు పంపింది. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విచారణలో తేలడంతో పాఠశాల ప్రిన్సిపాల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
ఇలాంటి ఘటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత వారం కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో స్కూల్ ప్రిన్సిపాల్ శంకరప్పను సస్పెండ్ చేశామని వెల్లడించారు. బెంగుళూరు, కోలారు జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. బెంగళూరు, కోలారు జిల్లాల్లో ఘటనలు మరువక ముందే శివమొగ్గలో మరుగుదొడ్లు శుభ్రం చేయమని చిన్నారులను అడిగే ఉదంతాలు వెలుగులోకి రావడం గమనార్హం. కోలార్ జిల్లాలో దళిత విద్యార్థులు సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేస్తున్న వీడియో బయటకు రావడంతో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. ఇందులో నలుగురు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు.