NTV Telugu Site icon

Griha Lakshmi Yojana: మహిళలకు కర్ణాటక సర్కారు రక్షాబంధన్ కానుక

Griha Lakshmi Yojana

Griha Lakshmi Yojana

Griha Lakshmi Yojana: రక్షా బంధన్‌ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం మహిళలకు భారీ కానుక అందించింది. కర్ణాటకలోని అక్కాచెల్లెళ్లకు సిద్ధరామయ్య ప్రభుత్వం రక్షాబంధన్ కానుక ఇచ్చింది. కర్ణాటకలోని మైసూర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఎంపీ రాహుల్‌గాంధీ గృహ లక్ష్మి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కోటి మందికి పైగా మహిళలకు నెలవారీ రూ.2000 భృతిని అందజేస్తామని నేతలు తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గృహలక్ష్మి యోజన కార్యక్రమంలో ప్రసంగించారు. ఎన్నికల ముందు ఐదు వాగ్దానాలు చేశామని రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఏదైనా చెబితే అది చేసి చూపిస్తుందన్నారు. గృహలక్ష్మి, శక్తి యోజన, గృహజ్యోతి, అన్న భాగ్య, యువ నిధి యోజనలను కాంగ్రెస్ ప్రారంభించిందన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు ఐదు వాగ్దానాలు చేసింది. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతలు ఏదైనా చెబితే అది చేస్తారని మేం చెప్పాం. ఈరోజు మనం ట్యాబ్‌లో క్లిక్ చేయగానే కోట్లాది మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.2000 జమ అయింది.” అని రాహుల్ పేర్కొన్నారు.

Also Read: Raksha Bandhan: సోదరుడికి నిజమైన రక్షాబంధన్‌ కానుక.. ప్రాణాన్ని కాపాడేందుకు కిడ్నీ!

రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడుతూ, ‘ఎన్నికల తర్వాత కర్ణాటకలో మహిళలు బస్సుల్లో ప్రయాణించడానికి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకానికి ‘శక్తి’ అని పేరు పెట్టి దానిని పూర్తి చేశాం.” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఐదు పథకాలు చూడండి అని రాహుల్ అన్నారు. ఒక్కటి తప్ప మిగతావన్నీ మహిళల కోసం, మిగిలిన నాలుగు పథకాలు మహిళల కోసం రూపొందించబడ్డాయన్నారు. దీని వెనుక లోతైన ఆలోచన ఉందన్నారు. తాను భారత్ జోడో యాత్రలో వేలాది మంది మహిళలను కలిశానని రాహుల్‌ పేర్కొన్నారు. కర్ణాటకలో దాదాపు 600 కిలోమీటర్లు నడిచానన్న రాహుల్ గాంధీ.. తనకు ఓ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు. ద్రవ్యోల్బణాన్ని భరించలేకపోతున్నామని వేలాది మంది మహిళలు తనతో చెప్పారని.. కర్ణాటక మహిళలే ఈ రాష్ట్రానికి పునాది అని తనకు అర్థమైందన్నారు.

1.1 కోట్ల మంది మహిళలకు నెలవారీ రూ.2,000 సహాయం అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గృహ లక్ష్మి యోజన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ ద్వారా మొత్తాన్ని బదిలీ చేశారు. అదే సమయంలో, ఈ పథకాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ప్రారంభించారు.