NTV Telugu Site icon

Crime News: పరువు హత్య.. కూతురుని గడ్డివాములో వేసి కాల్చేసిన తండ్రి!

Crime News

Crime News

దేశంలోని పలు రాష్ట్రాల్లో పరువు హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కూతుర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కసితో.. తండ్రులే కాలయముళ్లుగా మారుతున్నారు. పరువు కోసం కన్న కూతుళ్లనే అతి కిరాతంగా చంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. వివాహం అయినా తన ప్రేమికుడ్ని తరచుగా కలుస్తుందన్న కోపంతో కూతురుని ఓ తండ్రి గడ్డివాములో వేసి కాల్చేచేశాడు. ఈ హత్య జరిగిన ఏడు నెలలకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లాలోని నంగలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మరవేమన గ్రామంలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… మరవేమన గ్రామానికి చెందిన రవి (41) కుమార్తె అర్పిత (17). ఆమె బంధువుల కుటుంబంలోని ఒక అబ్బాయిని ప్రేమించింది. వరుసకు అతను అన్న అవుతాడని, ప్రేమ వద్దని తల్లిదండ్రులు అర్పితను హెచ్చరించారు. అయినా కూతురు వినకపోవడంతో.. హడావుడిగా నరసాపురం ఫిర్కా ఓడి కృష్ణాపుర గ్రామానికి చెందిన ఒక యువకునికి ఇచ్చి వివాహం చేశారు. అర్పితకు తన భర్తతో సంసారం చేయడం ఇష్టపడలేదు. ఈ విషయంపై అర్పిత భర్త రవికి పలుమార్లు ఫిర్యాదు చేశాడు. దీంతో రవి గత మే నెల 21న వెళ్లి కూతురుని తీసుకుని ఇంటికి బయలుదేరాడు.

Also Read: Amrit Bharat Express Ticket Price: ‘అమృత్‌ భారత్‌’ ఛార్జీలు ఎక్కువే.. కనీస టికెట్‌ ధర 35!

మరవేమన ఊరి సమీపంలో ఉన్న ముష్టూరు గ్రామం వద్ద ఉన్న ఫారం హౌస్‌ వద్దఅర్పితను కొట్టిన రవి.. ఆపై గొంతు పిసికి చంపాడు. విషయం ఎవరికీ చెప్పకుండా ఓ గడ్డివాములో శవాన్ని పడేసి నిప్పు పెట్టి ఇంటికి వెళ్లిపోయాడు. అక్టోబరు చివరి వారంలో రవి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి.. కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టిన అనంతరం రవి ప్రవర్తనపై అనుమానం రావడం, అదే సమయంలో ఒక ఆగంతకుడు స్టేషన్‌కు ఫోన్‌ చేసి రవి దురాగతాన్ని వివరించాడు. దాంతో రవిని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టగా.. తానే కుమార్తెను హత్య చేశానని అంగీకరించాడు. అర్పిత భర్త, అతని కుటుంబ సభ్యులపై బాల్యవివాహాల చట్టాలకు అనుగుణంగా కేసు నమోదు చేశారు.

Show comments