పన్నుల బదలాయింపు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. నాలుగేళ్లలో 45 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని అన్నారు. కర్ణాటక ప్రజలు కట్టే పన్నులు రాష్ట్ర కష్టాలను తీర్చలేక ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. ఇక, 15వ ఆర్థిక సంఘం తర్వాత తక్కువ పన్ను బదిలీ వాటాతో కర్ణాటక గణనీయమైన సవాళ్లను ఎదుర్కొందన్నారు. ఈ అన్యాయాన్ని సహించలేం.. మా రాష్ట్ర సంక్షేమం కోసం కర్ణాటక ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంలో మేము ఐక్యంగా ఉన్నామని “#SouthTaxMovement” హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ (X) లో పోస్ట్ చేశారు.
Read Also: AP Assembly Sessions: ఫిబ్రవరి 8 వరకు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం
అయితే, పన్నుల వ్యవహారంలో కర్ణాటకకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలో సీఎం సిద్ధరామయ్య సహా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ నిరసన తెలుపనున్నారు. పన్నుల బదిలీల్లో కర్ణాటక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను సమర్థిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు కట్టే పన్నులతో అప్పులపాలైన ఉత్తరాది రాష్ట్రాలు మనకు ఎప్పటికీ మోడల్ కాలేవన్నారు. ఈ తప్పుడు ఆలోచనను ప్రతి ఒక్కరూ పారద్రోలాలి.. కష్టపడి పటిష్టమైన భారతదేశాన్ని నిర్మిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. న్యాయం కోసం గళం విప్పిన కన్నడి వాసులకు సీఎం సిద్ధరామయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.
