Karnataka: ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు గెలిచిన ఎమ్మె్ల్యేలు 8మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం సిద్ధరామయ్య ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తోంది. దాని కోసం ఇప్పటికే కసరత్తు పూర్తయ్యింది. మొదటిసారిగా 24 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరంతా శనివారం (27వ తేదీ) ప్రమాణస్వీకారం చేయనున్నారు. క్యాబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అగ్రనేతలు గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Read Also:Vidudala: వెట్రి మారన్ మాస్టర్ పీస్.. ‘విడుదల’ ఓటిటీలోకి వచ్చేసింది
ఈ ఇద్దరు నేతలు కర్ణాటక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్ దీప్ సూర్జేవాలా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఆయన నివాసంలో సమావేశం జరిగింది. అనంతరం సీఎం సిద్దరామయ్య, శివకుమార్ సహా కాంగ్రెస్ నేతలు పార్టీ గురుద్వారా రకాబ్ గంజ్ రోడ్ కార్యాలయంలో చర్చలు నిర్వహించారు. రాష్ట్ర విస్తరణ మంత్రివర్గంలో అర్హులైన వారి పేర్లపై చర్చించారు. శివకుమార్ బుధవారం సాయంత్రం దేశ రాజధానికి చేరుకోగా, సిద్ధరామయ్య రాత్రి వచ్చారు. ఈ నెల 20న కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణస్వీకారం జరిగింది. అయినా ఇప్పటి వరకు మంత్రులకు శాఖలు కేటాయించలేదు. కర్ణాటకలో దాదాపు 34 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశావహులందరినీ సంతృప్తి పరచడం కాంగ్రెస్ కు కష్టతరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also:Off The Record: బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీకి క్లారిటీ వచ్చేసిందా.?