NTV Telugu Site icon

Karnataka: గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై నిషేధం

Ban In Karnatka

Ban In Karnatka

మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ రెండు విక్రయాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కృత్రిమ రంగుల వాడకం ఆరోగ్యానికి హానికరమని తేలిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో కృత్రిమ ఫుడ్‌ కలర్‌తో చేసే గోబీ మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించినట్లు తెలిపింది. వీటిల్లో రంగుల కోసం ఉపయోగించే రోడమైన్‌-బి అనే రసాయనం ఆరోగ్యానికి హానికరమని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండురావు మీడియాతో మాట్లాడారు. కొన్ని ఆహార పదార్థాల తయారీకి హానికరమైన రసాయనాలు ఉపయోగించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆరోగ్య అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పలు ఫుడ్‌ సెంటర్ల నుంచి 171 నమూనాలను సేకరించారని.. వాటిని పరీక్షించగా 107 పదార్థాల్లో హానికర కృత్రిమ రంగులను ఉపయోగించినట్లు తేలిందని చెప్పారు. వాటిల్లో రోడమైన్‌-బి, టాట్రజైన్‌ వంటి రసాయనాలను వినియోగిస్తున్నారని.. ఇవి ఆరోగ్యానికి ముప్పు తీసుకొస్తాయని ఆయన పేర్కొన్నారు.

రసాయనాలతో చేసే కలర్ గోబీ మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దీన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సురక్షితం కాని రసాయనాలను ఉపయోగించే ఫుడ్‌ సెంటర్లపై కూడా అధికారులు కేసు నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధలను పాటించని వారికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు లైసెన్సును రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రంగులు వేయని తెల్లని పీచు మిఠాయి విక్రయాలపై ఎలాంటి నిషేధం లేదని… వాటిని విక్రయాలు చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

ఇటీవల తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా పీచు మిఠాయిపై నిషేధం విధించారు. అలాగే పలు రాష్ట్రాల్లో కూడా నిషేధం విధించేందుకు ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. ఆ దిశగా తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

రోడమైన్‌-బిని దుస్తుల కలరింగ్‌, పేపర్‌ ప్రింటింగ్‌లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. కానీ ఫుడ్‌ కలరింగ్‌‌కు మాత్రం ఉపయోగించకూడదు. దీని వల్ల దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశముందని ఆరోగ్య శాఖ పరిశీలనలో తేలిందని అధికారులు తెలిపారు. ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్‌ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, అల్సర్‌ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.

 

Show comments