ఈ బాధ్యత కరీంనగర్ ప్రజలు పెట్టిన బిక్ష అని..సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే బీజేపీ కారణమని బండి సంజయ్ అన్నారు. 152 రోజులు కుటుంబానికి దూరమై ప్రజా సంగ్రామయాత్రతో తన వెంట ఉన్నారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా సొంత గడ్డ కరీంనగర్ కు చేరుకున్న బండి సంజయ్ కి బీజేపీ కార్యకర్తలు బుల్డోజర్ తో అపూర్వ స్వాగతం పలికారు. బుల్డోజర్లపై నుంచి పూలు చల్లి…గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. కరీంనగర్ గడ్డకు పాదాభివందనం చేయడం ద్వారా తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జై బీజేపీ…. జైజై నరేంద్ర మోడీ… భారతమాతాకీ జై అంటూ నినదించారు బండి సంజయ్. బండి సంజయ్ కరీంనగర్ గడ్డపై ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేయడంతో కరీంనగర్ ప్రజలు ఫిదా అయ్యారు. అనంతరం గీతాభవన్ చౌరస్తాకు చేరుకున్న బండి సంజయ్ కు అపూర్వ స్వాగతం దక్కింది. స్థానిక ముస్లిం నేతలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. నేరుగా బండి సంజయ్ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కార్యకర్తల కష్టార్జితం వల్లే ఈరోజు తనకు ఈ పదవి లభించిందన్నారు. ఈ పదవి, హోదా కార్యకర్తలకు అంకితం చేస్తున్నానన్నారు.
READ MORE: TGSRTC: కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారి..జీవితకాలం ఉచిత బస్ పాస్ మంజూరు
కమిట్ మెంట్ తో పని చేసే కార్యకర్తలు ఉన్నారు కాబట్టే కేంద్రం తనను గుర్తించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రమంత్రిగా కరీంనగర్ అభివృద్ధికి పాటుపడుతానని హామీ ఇచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అందరిని కలుపుకుని అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి రెండోసారి ఎంపీగా బీజేపీ తరుఫున పోటీ చేసిన బండి సంజయ్ ఘన విజయం సాధించారు. దీంతో ఆయన సేవను గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో కేంద్ర హోం సహాయ మంత్రిగా అవకాశం కల్పించింది. ఆయన ఢిల్లీకి వెళ్లి ఈ నెల 13న బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రం నుంచి బండి సంజయ్ తో పాటు ఎంపీ కిషన్ రెడ్డికి కూడా కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది. ఆయన బొగ్గు, గనులశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.