తమ పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో తల్లిదండ్రులే కన్న కూతురిని అతి దారుణంగా హత్య చేశారు. తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు కూతురి హత్యను ఆత్మహత్యగా చిత్రికరించి.. చివరకు పోలీసులకు చిక్కారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటన గత నెల 14న జరగగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు బాలిక తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వాయిపేట గ్రామానికి చెందిన రాజు రెడ్డి, లావణ్య దంపతులకు కుమార్తె అర్చన (16) ఉంది. సోమారం మోడల్ స్కూల్‌లో అర్చన ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ పెళ్లైన యువకుడితో అర్చన ప్రేమాయణం సాగించింది. యువకునికి భార్యతో పాటుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం తల్లిదండ్రులకి తెలియడంతో కూతురిని మందలించారు. అయినా అర్చన ప్రవర్తనలో మార్పు రాలేదు. కూతురి వల్ల కుటుంబ పరువు పోతుందనే భయంతో తల్లిదండ్రులు ఓ పథకం పన్నారు.
Also Read: Crime News: నల్లకుంటలో దారుణం.. పిల్లల ముందే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త!
నవంబర్ 14న రాత్రి నిద్రిస్తున్న అర్చనకు తల్లిదండ్రులు బలవంతంగా పురుగుల మందు తాగించారు. అయినా ఆమె చనిపోకపోవడంతో.. తండ్రి గొంతు పిసికి చంపేశాడు. తమ కూతురు కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి భోజనం చేసి అందరం నిద్రపోయామని, తెల్లవారుజామున 4 గంటలకు చూసేసరికి అర్చన నోట్లో నురుగు కనిపించిందని, అప్పటికే మృతి చెందినట్లు పోలీసులకు చెప్పారు. అర్చనకు కడుపునొప్పి సహా థైరాయిడ్ సమస్య కూడా ఉందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇది పరువు హత్యగా తేల్చారు.
