NTV Telugu Site icon

Kareena Kapoor: యునిసెఫ్‌ ఇండియా నేషనల్‌ అంబాసిడర్‌గా కరీనా కపూర్‌ నియామకం

Kareena Kapoor

Kareena Kapoor

Kareena Kapoor: యునిసెఫ్ ( యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్-UNICEF ) ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ను నియమించారు. ఈ విషయాన్ని యునిసెఫ్ శనివారం ప్రకటించింది. 2014 నుంచి ఆమె యునెసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్‌గా కొనసాగుతున్నారు. మే 4న (శనివారం) ఆమె నియామకం ఖరారైంది. గత పదేళ్లుగా కరీనాకు యూనిసెఫ్‌తో అనుబంధం ఉంది. 2014 నుంచి ఆమె యూనిసెఫ్‌ సెలెబ్రిటీ అడ్వకేట్‌గా కొనసాగుతున్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం కరీనా ఉద్వేగంతో ప్రసంగించారు. భావి తరానికి ప్రతినిధులైన పిల్లల హక్కులు కాపాడుకోడానికి పోరాటం సాగించేలా , యునిసెఫ్‌తో తన సంబంధం ఈ విధంగా కొనసాగేలా రాయబారిగా గౌరవించడం తనకు గర్వకారణంగా ఉందని ఆమె భావోద్వేగంతో మాట్లాడారు. ఈ సందర్భంగా యునిసెఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో అణగారిన పిల్లల కోసం, వారి హక్కుల కోసం తన గళం విప్పి పోరాటం సాగిస్తానన్నారు. పిల్లల చదువు, లింగసమానత కోసం పాటుపడతానని చెప్పారు. కరీనాతోపాటు మరో నలుగురు యువ న్యాయవాదులను యునిసెఫ్ నియమించింది.

Read Also: RCB vs GT: విరాట్ కోహ్లీ బుల్లెట్ త్రో.. షారూఖ్‌ ఖాన్ ఫ్యూజ్‌లు ఔట్‌!

వాతావరణ సమస్య, మానసిక ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ (స్టెమ్స్) తదితర రంగాలకు కృషి చేసేలా నలుగురు అడ్వకేట్లను నియమించింది. ఆ నలుగురిలో గౌరంశీ శర్మ (మధ్యప్రదేశ్) పిల్లలు ఆడుకునే హక్కు, వికలాంగులైన పిల్లలను కూడా వీరిలో కలుపుకోవడంలో కృషి చేస్తారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్తీక్ వర్మ వాతావరణ మార్పుల సమస్య, బాలలహక్కుల సాధనకు కృషి చేస్తారు. గాయని నహీడ్ అఫ్రిన్ (అస్సాం) మానసిక ఆరోగ్యం, చిన్న పిల్లల అభివృద్ధికి ప్రయత్నిస్తారు. తమిళనాడుకు చెందిన వినీషా ఉమాశంకర్ వర్ధమాన ఆవిష్కర్తల కోసం, స్టెమ్ సారధిగా పనిచేస్తారు. ఈ విధంగా ప్రపంచం మొత్తం మీద 93 యువ అడ్వకేట్లను యునిసెఫ్ నియమించింది. కరీనా కపూర్‌ నేషనల్ అంబాసిడర్‌గా ఎన్నికవడంతో యూనిసెఫ్‌ ఇండియాలో కొత్త ఉత్సాహం నిండిందని యూనిసెఫ్‌లో భారత ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రే అన్నారు. అనేక జాతీయ , అంతర్జాతీయ కార్యక్రమాలకు సహకరించడం ద్వారా ఆమె నూతన ఉత్తేజాన్ని తీసుకురాగలరని ఆశించారు.