Hyderabad: అతివేగం మరో యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కాప్రా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాప్రాలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న ఎం. శేఖర్ (23) కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి శేఖర్ తన బైక్‌పై నేతాజీ నగర్ చౌరస్తా నుంచి ఇంటి వైపు వస్తుండగా, కట్టమైసమ్మ ఆలయం సమీపానికి చేరుకున్న సమయంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ అతివేగంగా వచ్చి శేఖర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శేఖర్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే విషయాన్ని అతని యజమాని రాఘవుల శివకు తెలియజేశారు. 108 అంబులెన్స్ ద్వారా శేఖర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న శేఖర్ తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఎం. గంగయ్య ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బైక్‌ను నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపిన వ్యక్తి వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.