NTV Telugu Site icon

Kanti Velugu : రికార్డు దిశగా కంటివెలుగు.. 1.58 కోట్ల మందికి పైగా పరీక్షలు

Kanti Velugu

Kanti Velugu

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కింద ఇప్పటి వరకు 1.58 కోట్ల మందికి పైగా ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్ష శిబిరాలు నిర్వహిస్తున్నారు. 22,21,494 మందికి రీడింగ్ గ్లాసెస్ అందించారు. అంధత్వ రహిత తెలంగాణ నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమం 12,304 గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో కొనసాగుతోంది.

Also Read : Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

ఆగస్టు 15, 2018న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొదటి దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం 8 నెలల పాటు కొనసాగింది, ఇందులో 1.50 కోట్ల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. 50 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి 2023 జనవరి 18న రెండవ దశను ప్రారంభించారు. 89 పని దినాలలో 96.21 శాతం మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 100 పనిదినాల లక్ష్యంలో ప్రజలందరికీ కంటి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇతర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజాప్రతినిధులు, వైద్యశాఖ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ తదితర శాఖల అధికారులు చురుగ్గా పాల్గొంటున్నారు. బృందాల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిలో నాణ్యత నియంత్రణ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే 2 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని వైద్యశాఖ అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం గర్వకారణమన్నారు.

అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందించి శిబిరాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు ముందస్తు ప్రణాళికలు, నిరంతర పర్యవేక్షణ, రోజువారీ సమీక్షలు, విశ్లేషణ, వీడియో కాన్ఫరెన్స్, సమావేశాలతో ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పటిష్టంగా అమలు చేస్తున్నారు.

శిబిరాల్లో నమోదైన లెక్కల ప్రకారం అన్ని జిల్లాల్లో కంటి చూపు మందగించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వారు దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేరు. 40 ఏళ్లు పైబడిన చాలా మంది దగ్గరి దృష్టి లోపంతో శిబిరానికి వస్తుంటారు. అలాంటి వారికి వెంటనే రీడింగ్ గ్లాసెస్ అందజేస్తారు. వీటితోపాటు కంటి సమస్యలతో వస్తున్న పలువురికి విటమిన్ ఎ, డి, బి కాంప్లెక్స్ మాత్రలను పంపిణీ చేస్తున్నారు.

50 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా కంటి శుక్లాలతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి సమాచారం అందిస్తున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే శస్త్ర చికిత్సలు చేయించుకుని ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.