బాలీవుడ్ స్టార్ హీరోయిన్, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ ఎంపీ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో కంగనా ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్లు గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా ఈ వార్తలపై స్పందిస్తూ తనదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చారు.
Also Read : Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదాకు ఏఆర్ రెహమాన్ కారణమా..?
చిరాగ్ పాశ్వాన్‌తో ఉన్న సంబంధంపై కంగనా స్పష్టతనిస్తూ.. “చిరాగ్ నాకు చాలా కాలంగా తెలుసు, అతను నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. మా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మా మధ్య ఎలాంటి ప్రేమ గానీ, రొమాన్స్ గానీ లేవు”. తామిద్దరం కలిసి గతంలో ఒక సినిమా చేసినప్పటి నుంచి ఈ బంధం కొనసాగుతోంది. మా మధ్య ఒకవేళ నిజంగానే ప్రేమ ఉండి ఉంటే ఈ పాటికి మాకు పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉండేవారు. ఇన్నేళ్లుగా మా మధ్య ఎలాంటి మార్పు రాలేదు. అది ఎప్పటికీ కేవలం స్నేహంగానే కొనసాగుతుంది” అంటూ కంగనా ఈ వార్తలను కొట్టిపారేశారు.
Also Read : swayambhu : నిఖిల్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్వయంభు’ ఫస్ట్ సాంగ్ ఆదరిందిగా
కంగనా రనౌత్ మరియు చిరాగ్ పాశ్వాన్ 2011లో విడుదలైన ‘మిలే నా మిలే హమ్’ చిత్రంలో జంటగా నటించారు. ఆ సినిమా తర్వాత చిరాగ్ రాజకీయాల్లోకి వెళ్లగా కంగనా సినిమాల్లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఇద్దరూ పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇటీవల పార్లమెంట్ ఆవరణలో వీరిద్దరూ నవ్వుతూ పలకరించుకున్న ఫోటోలు వైరల్ కావడంతో ఈ రూమర్లు మళ్ళీ తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా కంగనా ఇచ్చిన క్లారిటీతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.
