NTV Telugu Site icon

Kane Williamson Out: న్యూజిలాండ్‌కు భారీ షాక్‌.. కేన్‌ మామ దూరం!

Kane Williamson

Kane Williamson

Kane Williamson ruled out from England vs New Zealand Match in World Cup 2023: భారత గడ్డపై జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023కి సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆరంభం కానుండగా.. ఆక్టోబర్‌ 5 నుంచి మెగా మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ జట్ల తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. కివీస్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయం కారణంగా మెగా టోర్నీ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు న్యూజిలాండ్ మేనేజ్‌మెంట్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

కేన్‌ విలియమ్సన్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతోనే ఆక్టోబర్‌ 5న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌ ఆడడని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. అయితే వార్మప్‌ మ్యాచ్‌ల్లో మాత్రం కేన్‌ మామ ఆడుతాడని తెలిపింది. ఈరోజు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో కేన్‌ కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. దాంతో కేన్‌ మామ స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ టామ్ లాథమ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

Also Read: Chandrababu Naidu: టీడీపీని ఎంత అణచివేయాలని చూస్తే.. అంత ఎదుగుతుంది: నారాయణ

దక్షిణాఫ్రికాతో త్రివేండ్రంలో జరిగే రెండో వార్మప్ మ్యాచ్‌లో కేన్‌ విలియమ్సన్‌ ఫిట్‌నెస్‌ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు పరిశీలించనుంది. దక్షిణాఫ్రికాపై కేన్‌.. బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ చేసే అవకాశం ఉంది. కేన్ పునరావాసం కోసం రోజువారీ విధానాన్ని తాము కొనసాగిస్తామని, ఫిట్‌నెస్‌ సాదించకున్నా ఆడాలనే ఒత్తిడి అతనిపై లేదని కోచ్ గ్యారీ స్టెడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 2023 ఆరంభంలో కేన్‌ మోకాలికి తీవ్ర గాయమైంది. స్వదేశానికి వెళ్లిన అతడు మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న కేన్‌.. ఫిట్‌నెస్‌ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు.