Shadnagar: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ గ్రామపంచాయతీ ఎన్నికల వేళ అపశృతి చోటుచేసుకుంది. ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో ఆవ శేఖర్ అనే యువకుడు రైలు పట్టాలపై అనుమానస్పద రీతిలో మృతి చెందడం సంచలనంగా మారింది. నాల్గవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆవ శేఖర్ మృతదేహం రైలు పట్టాలపై కనిపించడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రైల్వే పోలీసులు గ్రామస్థులకు అందించిన సమాచారం ప్రకారం.. రైలు పట్టాలపై పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహం వద్ద ఆధార్ కార్డు కనుగొన్నారు. మృతుడు కంసాన్ పల్లికి చెందిన ఆవ శేఖర్‌గా గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందజేశారు.
READ MORE: Off The Record: కూటమి ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్..
గ్రామస్థులు, కుటుంబీకుల సమాచారం ప్రకారం.. ఆవ శేఖర్ కంసాన్ పల్లి గ్రామ నాలుగో వార్డ్ వార్డు సభ్యుడు పదవికి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గత నాలుగు రోజులుగా గ్రామంలో కొందరు శేఖర్ ను పోటీ నుంచి తప్పుకోవాలని తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. తరచూ వేధింపులకు గురి చేశారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే అవాంతరాలు సృష్టించి కేసులు పెడతామని, శేఖర్ ను కొందరు బెదిరించారు. ఈ విషయాన్ని బాధితుడు గ్రామంలో కొంతమంది వద్ద పంచుకుని కన్నీరు మున్నీరుగా విలపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శేఖర్ మంగళవారం ఉదయం గ్రామంలో కనిపించకుండా పోయాడు. ఇంతలో రైల్వే పోలీసులు ఆవ శేఖర్ రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందించడం గమనార్హం. అది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశంపై రాత్రి పూట గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది..