Sai Pallavi in Kalki 2: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను సాధించడమే కాకుండా జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ బ్లాక్‌బస్టర్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు దీని సీక్వెల్ ‘కల్కి 2’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్డేట్లు, కాస్టింగ్ వివరాలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
మొదటి భాగం ఘనవిజయం సాధించిన తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ సీక్వెల్ ప్లానింగ్‌లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు ప్రారంభమైనప్పటికీ, ప్రభాస్ ఇతర భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్‌కు తాత్కాలికంగా కొన్నాళ్ల పాటు బ్రేక్ పడింది. అయితే, తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ మళ్లీ రంగంలోకి దిగారు. అక్టోబర్ చివర్లోనే ప్రధాన తారాగణంతో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ వంటి భారీ చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. అయినా కూడా.. ‘కల్కి 2’ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెలాఖరు నుంచే ఈ సీక్వెల్ షూటింగ్ కోసం ప్రభాస్ డేట్స్ ఇవ్వడంతో, వచ్చే షెడ్యూల్లో ఆయనపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు టీమ్ రెడీ అవుతోంది.
‘కల్కి’ మొదటి భాగంలో గర్భవతి అయిన సుమతి పాత్రలో బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొనే అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే, రెండో భాగంలో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. దీపిక స్థానంలోకి లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి రాబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. నవంబర్ నుంచి ఆమె సెట్స్‌లో జాయిన్ కానున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఆమె ఎంట్రీ దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’తో బిజీగా ఉన్నారు. అయితే ‘కల్కి 2’లో ఆమె నేరుగా సుమతి పాత్రలోనే కనిపిస్తారా..? లేక కథలో మరో సరికొత్త కీలక పాత్రను పోషిస్తున్నారా..? అనే దానిపై చిత్ర బృందం ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది.

