Love Fail: లవర్ హ్యాండ్ ఇచ్చాడని మనస్తాపం… సీపీఆర్ చేసినా దక్కని యువతి ప్రాణాలు..

Love Suicide

Love Suicide

ప్రేమించడమే ఆమె పాలిట శాపమైంది.. తను ప్రేమించిన వ్యక్తి.. పెళ్లికి నో చెప్పడంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. మనస్థాపంతో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. విషాదకరమైన ఈ ఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగింది. ఐతే సహచర ఉద్యోగికి వీడియో కాల్ చేసి మరీ బలవన్మరణం చెందడం కలకలం రేపింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌ సమీపంలో తండి పీతాంబర్‌ కుటుంబతో సహా నివాసం ఉంటున్నాడు. నిజానికి అతడి స్వస్థలం ఒడిశా. పీతాంబర్ ఒడిశాకు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి. రిటైర్మెంట్‌ అనంతరం గొల్లప్రోలుకు వచ్చి స్థిరపడ్డారు. అతడి కుమార్తె తండి ఫిస్కిల్లా కాకినాడ ఎస్‌ఆర్‌ఎంటీ మాల్‌లో ఉన్న రిలయన్స్‌ డిజిటల్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌ సేల్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తోంది.

తల్లిదండ్రులు ఒడిశాలో తమ బంధువుల ఫంక్షన్‌కు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఫిస్కిల్లా .. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి వేసుకునే సమయంలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సహచర ఉద్యోగి, కాకినాడ సమీప మాధవపట్నానికి చెందిన నరేంద్రకుమార్‌కు ఫోన్‌ చేసి చెప్పింది. సమయంలో ఆమె మెడకు చున్నీ తగిలించుకుని రోదిస్తూ మాట్లాడినట్లు తెలుస్తోంది. కంగారు పడిన అతడు వెంటనే పిఠాపురం జగ్గయ్యచెరువులో నివాసముంటున్న చినబాబుకు ఫోన్‌ చేసి చెప్పాడు. అతడు అక్కడకు వెళ్లే సరికి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది ఫిస్కిల్లా. ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్లి ఆమెను కిందకు దింపాడు చినబాబు. బతుకుందేమోనని సీపీఆర్‌ చేశాడు. అనంతరం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.

మరోవైపు ఫిస్కిల్లా రెండేళ్లుగా తనతో పాటు పని చేసే ఉద్యోగితో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల అతడు వేరేచోటుకు బదిలీపై వెళ్లాడు. అనంతరం ఆ యువకుడికి పెళ్లి కుదిరినట్టు తెలిసింది. ఈ విషయంలో వారి మధ్య వివాదం జరిగినట్టు బంధువులు చెబుతున్నారు. ఫిస్కిల్లా చనిపోయే సమయంలో అతడికే సెల్ఫీ వీడియో కాల్‌ చేసి ఉరివేసుకున్నట్లు సమాచారం. ప్రేమికుడు ఎవరన్నదీ పోలీసులు గోప్యంగా ఉంచారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.