Kakinada Municipal Corporation Elections: కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల ఏజెంట్లుగా, పోలింగ్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భద్రత పొందుతున్న వ్యక్తులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.. వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి కాద సత్యశ్రీ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు స్పందించింది. కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఎస్ఈసీ కార్యదర్శి డాక్టర్ ఎ. మల్లికార్జున నవంబర్ 28న లేఖ రాశారు. 2026 మార్చి 26న జారీ చేసిన సర్క్యులర్ నంబర్ 172/SEC-F1/2026 ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఫిర్యాదు
కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ), ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఎన్నికల జనరల్ ఏజెంట్లుగా గుర్తింపు కార్డులు పొందారని కాద సత్యశ్రీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వీరు నవంబర్ 26న పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించారని ఆరోపించారు. జనసేన మేయర్ అభ్యర్థి ఆకుల భవానికి ఎన్నికల ఏజెంట్‌గా ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యవహరించినట్లు రిటర్నింగ్ అధికారి జారీ చేసిన నమూనా సంతకాల జాబితాలో నమోదైందని ఫిర్యాదులో వివరించారు. అలాగే అదే జాబితాలో ఏడో నంబరు అభ్యర్థికి ఎన్నికల ఏజెంట్‌గా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం పేరు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
కౌంటింగ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన
నవంబర్ 30న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఈ ప్రజాప్రతినిధులు పాల్గొంటే కౌంటింగ్ సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉందని సత్యశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఉనికి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రభావితం చేయవచ్చని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎన్నికల ఏజెంట్లుగా నియమించకూడదని 2009 ఏప్రిల్ 5న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబుతో పాటు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరానికి జారీ చేసిన జనరల్ ఏజెంట్ గుర్తింపు కార్డులను రద్దు చేయాలని కాద సత్యశ్రీ కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేయడం కాకినాడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

