Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా?

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణా రెడ్డి ఇంటిని కూలగొట్టడమే అని మండిపడ్డారు. సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా? అని ప్రశ్నించారు. పరిపాలన అంటే స్కూళ్లు, కాలేజీలను నిర్వహించడం కాదని మంత్రి నారాయణ తెలుసుకోవాలని కాకాని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్‌లో నగరపాలక సంస్థ అధికారులు కూల్చిన వైసీపీ నేత బాలకృష్ణ రెడ్డి ఇంటిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి చంద్ర శేఖర్ రెడ్డిలు పరిశీలించారు.

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణారెడ్డి ఇంటిని కూలగొట్టారు. 40 సంవత్సరాలుగా ఇదే ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే ఇంటిని ఆధునికీకరించారు. సంపద సృష్టించడం అంటే ఉన్న ఆస్తులను పగలగొట్టడమా?. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరిపాలన అంటే స్కూళ్లు, కాలేజీలను నిర్వహించడం కాదని నారాయణ తెలుసుకోవాలి. నారాయణ మంత్రి అయిన తర్వాత రకరకాల జీవోలు తీసుకువచ్చారు. వైసీపీ వాళ్ల ఇళ్లను కూల్చేస్తామని, టీడీపీ వారి జోలికిపోమని కూడా జీవో తీసుకురావాలి’ అని ఎద్దేవా చేశారు.

Also Read: AB De Villiers Re-Entry: అభిమానులకు శుభవార్త.. దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్‌!

‘ప్రజల ఓట్లు వేసి గెలిపించింది ఇందు కోసమా?. ఇంటి అంశం న్యాయస్థానంలో ఉన్నా కూలగొట్టారు. కొందరు మున్సిపల్ అధికారులు ఎగిరిపడుతున్నారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత అత్యుత్సాహం చూపిస్తున్న అధికారులను మరచిపోము. ఇలాంటి అధికారుల అంతు చూస్తాం. నారాయణ మెడికల్ కళాశాల కింద కూడా చాలా కాలువలు పోతున్నాయి. మెడికల్ కళాశాల కూడా కూలిపోతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నందున మీ కళాశాల జోలికి రాలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పటికైనా ధోరణి మార్చుకోవాలి’ అని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.

Exit mobile version