Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత

Jurala

Jurala

Jurala Project: జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 29 గేట్లను ఎత్తివేసి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్‌లోకి లక్షా 56 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, దిగువకు లక్షా 59 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. జలాశయానికి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలతో పాటు కుడి, ఎడమ కాలువలకు కూడా ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జలవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లోనూ పనులు జోరుగా సాగుతున్నాయి. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల పరిధిలోని మొత్తం 10 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

మరోవైపు, కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి శ్రీశైలం వైపు వేగంగా దూసుకొస్తోంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో ఏకంగా 220 మి.మీ. వర్షపాతం నమోదు కావడంతో కృష్ణా, కోయనా నదులు ప్రళయరూపంలో ప్రవహిస్తున్నాయి. అక్కడ రాధానగరి, వారణా జలాశయాలు ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో, రాబోయే 48 గంటల్లో ఆల్మట్టి డ్యామ్‌కు ఏకంగా 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన వర్షాలు ఇలాగే కొనసాగితే ఈ ప్రవాహం మరింత తీవ్రతరం కానుంది. ప్రస్తుతం కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.20 లక్షల క్యూసెక్కులు, భీమా నది నుంచి 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని శ్రీశైలం జలాశయానికి జలకళ సంతరించుకుంది. రాబోయే వారం రోజుల పాటు శ్రీశైలానికి భారీ స్థాయిలో వరద కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే ఉధృతి మరొక వారం రోజులు ముమ్మరంగా కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిపోయి, అధికారులు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మను పరుగులు తీయించనున్నారు.