సోమాజిగూడ శ్రీనగర్‌లో బూత్ స్థాయి సన్నాహక సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ రియాజ్, కార్పొరేటర్లు విజయా రెడ్డి, సంగీత, మాజీ ఎంపీ అజారుద్దీన్, ఎన్‌ఎస్‌యూఐ సెక్రటరీ కుందన్ యాదవ్, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, స్థానిక సీనియర్ నాయకులు సమావేశంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి.
ఏఐసీసీ ఇంచార్జీ, టీపీసీసీ చీఫ్ సమక్షంలో బీఆర్ఎస్ సీనియర్ మహిళ నేత ఆది లక్ష్మీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో వందలాది మంది మహిళ నేతలు చేశారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ… ‘పదేళ్ల విధ్వంస పాలనకు, 2 ఏళ్ల వికాస పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వల్లే అధికారంలోకి వచ్చాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో పదేళ్ల పాలనలో ఏం జరిగిందో ఆలోచించండి. రాష్ట్రాన్ని డ్రగ్స్ మయంగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. యువతకు మత్తుకు బానిస చేశారు. ప్రతిపక్షాల విష ప్రచారం నమ్మవద్దు, ప్రజలకు అవగాహన కల్పించాలి’ అని అన్నారు.
