NTV Telugu Site icon

JP Nadda: మోడీ హ్యాట్రిక్ ప్రధాని కావడం ఖాయం

Jp Nadda

Jp Nadda

ప్రపంచంలోనే బీజేపీ (BJP) అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల అజెండాను నిర్దేశించేందుకు భారతీయ జనతా పార్టీ రెండు రోజుల జాతీయ సదస్సును ఢిల్లీలో ప్రారంభించింది. ఈ సందర్భంగా నడ్డా ప్రసంగించారు.

ప్రధాని మోడీ (PM Modi) నాయకత్వంలో బీజేపీ పార్టీ దేశ వ్యాప్తంగా దూసుకెళ్తోందని చెప్పుకొచ్చారు. 12 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశంలో సుస్థిర ప్రభుత్వం వచ్చిందని తెలిపారు. 2014కు ముందు కేవలం 5 రాష్ట్రాల్లోనే కాషాయ పార్టీ ప్రభుత్వాలు ఉండేవని.. ఇప్పుడు పన్నెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. ఈరోజు బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని కొనియాడారు. 2014 తర్వాత 17 రాష్ట్రాల్లో స్వచ్ఛమైన ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయని.. 12 రాష్ట్రాల్లో అయితే సొంతంగా బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయని నడ్డా చెప్పుకొచ్చారు.

ముప్పై ఏళ్ల తర్వాత 2014లో దేశంలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడిందన్నారు. 2019లో మళ్లీ ప్రధాని మోడీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి రాబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. రామమందిర ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు రాకపోవడాన్ని నడ్డా తప్పుపట్టారు.

ఈ సమావేశంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు హాజరయ్యారు. ఫిబ్రవరి 18న ప్రధాని మోడీ ప్రసంగంతో ఈ సమావేశాలు ముగియనున్నాయి.