NTV Telugu Site icon

Konda Vishweswar Reddy: కొండా విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో బీజేపీలోకి చేరికలు

Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy

Konda Vishweswar Reddy: సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ భారతీయ జనతా పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన సుమారు వంద మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సర్పంచ్ స్వర్ణలత సుదర్శన్ నాయకత్వంలో శనివారం బీజేపీలో చేరారు. వీరికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాషాయ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రి చేయడానికి సంకల్పించిందన్నారు. ఆయన నాయకత్వంలోని భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా అభివృద్ధి చెందిందని, 2047 నాటికి ప్రపంచంలో అగ్రరాజ్యంగా భారతదేశం ఆవిర్భవించబోతుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నుంచి 2 లక్షల భారీ మెజారిటీతో తనను ప్రజలు గెలిపించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరింత కష్టపడి ఆ మెజార్టీని భారీగా పెంచాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలోని ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.