Makkan Singh Raj Thakur: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. రాజ్ ఠాకూర్ సమక్షంలో గొర్రె సతీష్ యాదవ్, రమేష్ రెడ్డి, ఇరుపాల మీనేష్ ,కుమారస్వామి, సింగవేణి తిరుపతి, అప్పల సత్తయ్య, గొర్రె కుమార్, క్రాంతి, వెంకట్, కృష్ణ, చంద్రం, మెడికల్ కృష్ణ, గడ్డి కుమార్ తదితరులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.
Also Read: CM KCR: రాహుల్ కు ఎద్దు ఎవుసం తెలుసో లేదో..
ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ… రామగుండం నియోజకవర్గంలోని ప్రజలను ఇంటింటికి వెళ్లి కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు. స్థానిక శాసన సభ్యుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాడు అనుకుంటే దోపిడి చేస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఒత్తిడి చేయడం, బెదిరించడం, కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రామగుండం ప్రాంతం ఒకప్పుడు పెద్ద నగరంగా ఉండేది కానీ ఇప్పుడు బొందల గడ్డగా మారడంతో ఈ ప్రాంతంలో వ్యాపారాలు జరుగక ఇతర ప్రాంతాలకు వలస పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. పాపం అని ఓటు వేస్తే మనకు శాపంగా మారాడని అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓట్లు కొందామని చూస్తున్నాడని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు. ప్రజాహితం కోరుకునే కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటు వేసి నాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి కుటుంబానికి 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, ఆర్టీసీ బస్సులు మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని, ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, పేదలకు 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు.