NTV Telugu Site icon

Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్

Joe Biden

Joe Biden

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు బరిలోకి దిగిన జోబైడెన్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రెసిడెంట్‌గా పూర్తి కాలం కొనసాగుతానని ఆయన తెలిపారు. అధ్యక్ష పోటీకి కమలాహారిస్‌ను బైడెన్ ప్రతిపాదించారు. కాగా బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు ట్రంప్‌తో జరిగిన చర్చలో ఘోర వైఫల్యం చెందడంతో వైదొలగక తప్పని పరిస్థితి తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ఆదివారం బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో డెమోక్రాట్లలో అయోమయ పరిస్థితి నెలకొంది. బరిలో ఎవరు నిలుస్తారన్న దానిపై ఉత్కంఠకు తెరలేచింది. లేఖలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్‌.. ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘ఈ రోజు నా పూర్తి మద్దతును హారిస్‌కు ఇస్తున్నా. ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నా. డెమోక్రాట్లు ఐక్యంగా ట్రంప్‌ను ఓడించండి’ అని బైడెన్ పేర్కొన్నారు. బైడెన్‌ ఎన్నికల బరి నుంచి వైదొలగడంతో అందరి దృష్టి కమలాహారిస్‌పైనే పడింది. పైగా అధ్యక్షుడు ఆమెకు మద్దతు పలకడం ఉత్కంఠకు కారణమవుతోంది. ఒకవైపు బైడెన్ అంగీకరించగానే కమలాహారిస్ అభ్యర్థి కాలేరు. వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులోనే అభ్యర్థి నిర్ణయం కావాల్సి ఉంది. 4,700 మంది ప్రతినిధులు అభ్యర్థిని ఆమోదించాల్సి ఉంటుంది.

Read Also: YouTuber: నూతన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే డెలివరీ బాయ్స్ సంపాదనే ఎక్కువ..!

డెమోక్రాట్ పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ తాను నామినేషన్‌ను ఆమోదించకుండా పరిపాలనపైన దృష్టి పెట్టాలనుకుంటున్నానని బైడెన్ వెల్లడించారు. 2020లో తాను అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించగానే మొదటగా కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా నియమించానని, ఈ మూడున్నరేళ్ల పాలనలో ఆమె తనకు ఎంతగానో సహకరించారని, తన వారసురాలిగా ఆమెను ఆమోదిస్తున్నాంటూ బైడెన్ పేర్కొన్నారు. కమలా హారిస్‌కు తాను పూర్తిస్థాయిలో మద్దతిస్తానని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ట్రంప్‌ను ఓడిద్దామంటూ బైడెన్ పిలుపునిచ్చారు. తన పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నామని, పార్టీ నిర్ణయం మేరకు దేశ ప్రయోజనాల కోసం ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇక ప్రియమైన అమెరికన్లకు అని సంభోదిస్తూ.. అమెరికా అధ్యక్షుడిగా సేవ చేయడం తన జీవితంలో గొప్ప గౌరవమని బైడెన్ పేర్కొన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో చక్కటి పురోగతి సాధించామని, నేడు అమెరికా ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఉందని అన్నారు. దేశ పునర్నిర్మాణంలో ఎంతో కృషి చేశామని, డ్రగ్స్‌ను నిరోధించామని, తుపాకీ సంస్కృతికి చెక్‌ పెట్టేలా చట్టాన్ని తీసుకొచ్చామని ఆయన ప్రస్తావించారు. అంతేకాదు కొవిడ్‌ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లామని, ఆర్థిక ఒడిదుడుకులు ఎదురుకాకుండా వ్యవహరించామని తెలిపారు.

Show comments