US President Joe Biden and First Lady Jill Biden Safe After Car Crash: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని వాహనాన్ని ఓ ప్రైవేటు కారు ఢీకొంది. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి డెలావర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. జో బైడెన్ వాహనానికి సమీపంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా వైఫల్య ఘటన అమెరికాలో కలకలం రేపింది.
యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ డెలావర్‌లో ఆదివారం రాత్రి పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. డిన్నర్ ముగించుకున్న బైడెన్ దంపతులు.. ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్ వద్దకు బయలుదేరారు. ఆ సమయంలో ఓ సెడాన్ వేగంగా దూసుకొచ్చి.. కాన్వాయ్‌లోని యూఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొంది. ఆ సమయంలో జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. జో బైడెన్ వాహనానికి 130 అడుగుల దూరంలో ఉన్నారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైడెన్‌ను వేగంగా అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు.
Also Read: IPL 2024 Auction: వేలంలో భారీప్రైజ్ ఈ ఐదుగురు ఆల్‌రౌండర్లకేనా.. భారత్ నుంచి ఒక్కడే!
ఈ ఘటనకు పాల్పడిన వాహనాన్ని భద్రతా అధికారులు చుట్టుముట్టి.. సదరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో బైడెన్ దంపతులను హుటాహుటిన వైట్‌హౌస్‌కు తరలించారు. అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా అధికారులు డ్రైవర్‌ను విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.