NTV Telugu Site icon

Hemant Soren: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యే ఛాన్స్.. నెక్ట్స్ సీఎం ఎవరంటే..!

Hemanth Soren

Hemanth Soren

గత వారంలో నెలకొన్న బీహార్ సంక్షోభం ఆదివారంతో ఫుల్ స్టాప్ పడగా.. ఇప్పుడు ఝార్ఖండ్ వంతు వచ్చింది. తాజాగా ఝార్ఖండ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ హాట్‌గా సాగుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మిస్సింగ్ అయ్యారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. వారం రోజుల క్రితం ఆయన ఢిల్లీలోని అధికార నివాసానికి వచ్చిన తర్వాత హేమంత్ కనిపించకుండపోయారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోమవారం ఢిల్లీలోని సీఎం నివాసానికి ఈడీ అధికారులు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి అందుబాటులో లేరు. దీంతో ఓ బీఎండబ్ల్యూ కారు, బ్యాగ్ సీజ్ చేసి అధికారులు వెళ్లిపోయారు. ఈ పరిణామంతో హేమంత్ సోరెన్ మిస్సింగ్ అంటూ మీడియాలో బర్నింగ్ టాఫిక్‌గా మారింది.

రాంచీలో హేమంత్ ప్రత్యక్షం..
మంగళవారం మధ్యాహ్నం హేమంత్ సోరెన్ రాంచీలో సడన్‌గా ప్రత్యక్షమయ్యారు. మరోవైపు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావాలని ముందుగానే ముఖ్యమంత్రి ఆదేశించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఈడీ అధికారులు వెంటాడుతుండడంతో అరెస్ట్ చేయడం ఖాయమన్న భావనతోనే హేమంత్ ఎమ్మెల్యేలను పిలిచినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అరెస్ట్‌కు ముందుగానే తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు హేమంత్ పిలిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా సీఎం నివాసానికి చేరుకున్నారు. వారం రోజులు రాంచీలోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించడంతో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజీలతో సోమవారమే రాంచీలో మకాం వేసేశారు.

సీఎంగా కల్పనా..
మరికాసేపట్లో హేమంత్ సోరెన్ అధ్యక్షతన కూటమి ఎమ్మెల్యేలంతా భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రిగా హేమంత్ భార్య కల్పనా సోరెన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే ప్రభుత్వం అస్థితర పడకుండా ఉండేందుకు హేమంత్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.

హేమంత్ భయపడుతున్నారు: దూబే
ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ మిస్సింగ్‌పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ విచారణకు సీఎం హేమంత్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే ముఖ్యమంత్రి బాధ్యతలు హేమంత్ సతీమణి కల్పనకు అప్పగించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.