NTV Telugu Site icon

Off The Record: జేసీ ప్రభాకర్ రెడ్డి అసహనం… కారణం ఏమిటి..?

Otr Jc Prabhakar Reddy

Otr Jc Prabhakar Reddy

Off The Record: వాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డాం…. మనం పవర్‌లోకి వచ్చాకా… ఇబ్బందులు పడుతున్నాం. ఇక బతుకంతా ఇంతేనా? కొట్లాడుతూనే ఉండాల్నా? ఇంకెన్నాళ్ళిలా పోరాటం…. అంటూ తెగ ఫ్రస్ట్రేట్‌ అయిపోతున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. ఏదేమైనా సరే… వెనక్కి తగ్గేదే లేదు. ప్రైవేట్‌ కేసులు వేసైనా సరే… నేను అనుకున్నది సాధిస్తానంటున్న ఆ లీడర్‌ ఎవరు? ఆయన అసహనానికి కారణం ఏంటి?

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతల మీద రకరకాల కేసులు బుక్‌ అయ్యాయి. కొందరు తెలుగుదేశం నాయకులు జైళ్ళకు కూడా వెళ్ళారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారి కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక నాటి ఘటనలపై విచారణ జరుగుతోంది. అయితే… అది సక్రమంగా జరగడం లేదని, సొంత పార్టీ అధికారంలో ఉన్నా… తమకు న్యాయం జరగడం లేదన్న అసహనంతో ఉన్నారట తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ హయాంలో బాగా ఇబ్బంది పడ్డ టాప్ ఫైవ్ లిస్ట్‌లో ప్రభాకర్ రెడ్డి ఉంటారని చెప్పుకుంటారు. దివాకర్ ట్రావెల్స్ విషయంలో చాలా కేసులు పడ్డాయి ఆయన మీద. అప్పటి ఆర్టీఏ అధికారులు పెట్టిన వరుస కేసులతో… 54 రోజులపాటు జైల్లో కూడా ఉన్నారు జేసీ. ఆయన కుమారుడు, తాడిపత్రి సిట్టింగ్‌ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కూడా జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒక కేసులో జైలు నుంచి విడుదలైన వెంటనే మరో కేసులో తిరిగి లోపలికి పంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తంగా వైసీపీ హయాంలో ఆయన ఆర్ధిక వనరుల మీద గట్టి దెబ్బే పడిందన్నది రాజకీయ పరిశీలకుల మాట.

తాను చట్ట ప్రకారమే నడుచుకున్నానని, వైసీపీ ముఖ్యుల ప్రోద్బలంతోనే కేసులు పెట్టారని అప్పటి నుంచి ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే. అధికారుల తీరుపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారాయన. కొనసాగింపుగా… మేం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క అధికారిని వదిలేది లేదంటూ అప్పట్లోనే వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇచ్చేశారు. ఇక… ఆయన ఆశించినట్టే… 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు కూడా. కానీ… ఆరు నెలలు గడుస్తున్నా… తన మీద పెట్టిన అక్రమ కేసుల విషయంలో అతీగతీ లేకుండా ఉందన్న ఫ్రస్ట్రేషన్‌ పెరుగుతోందట ప్రభాకర్‌రెడ్డిలో. వాళ్ళ హయాంలో పోరాడి, మన హయాంలోనూ పోరాడాలా? ఏంటిది? ఎన్నాళ్ళిలా పోరాటాలు…. అంటూ సన్నిహితుల దగ్గర తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. తనపై అక్రమ కేసులు బనాయించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటూ గత జులై 24న తాడిపత్రి వన్‌టౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు జేసీ. గతంలో ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషన్ శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన కుమారుడిపై ఫిర్యాదు చేశారు ప్రభాకర్‌రెడ్డి.

కానీ… దానికి సంబంధించి ఇంత వరకు ఎలాంటి కేసు బుక్‌ చేయలేదు పోలీసులు. దీంతో నేరుగా జిల్లా కోర్ట్‌కు వెళ్ళారు ప్రభాకర్ రెడ్డి. ఆ అధికారులపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలన్నది కోర్ట్‌కు ఆయన విన్నపం. అసలు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పోలీసులు… ఆరు నెలలు అవుతున్నా పట్టించుకోవడం లేదంటూ తీవ్ర అసహనంగా ఉన్నారట ఆయన. వాళ్ళ హయాంలో వేధించారు, తీరా మన సర్కార్‌ వచ్చాక కనీసం కేసు కూడా పెట్టకుండా తాత్సారం చేస్తున్నారని, సొంత పార్టీ ప్రభుత్వం అంటే… ఉండాల్సింది ఇలాగేనా అంటూ తెగ ఫైరైపోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ప్రైవేట్ కేసులు వేసే పనిలో ప్రభాకర్‌రెడ్డి ఉన్నట్టు సమాచారం. ఇటీవల కడప జిల్లాలో ఆర్టీపీఎస్‌ బూడిద వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. ఆ పంచాయితీ ఇప్పటికీ తెగ లేదు. ఇలా ఏ విషయంలోనూ తనకు అనుకూలంగా లేదని మాజీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అదే సమయంలో ఓవైపు నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తూనే… మరోవైపు ప్రైవేట్‌ కేసులతో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార పక్షంలో ఉన్నా… ప్రతిపక్షంలోలాగే… పోరాటం చేయక తప్పని పరిస్థితులు దాపురించాయని మాట్లాడుకుంటోందట జేసీ వర్గం. మాజీ ఎమ్మెల్యే తదుపరి అడుగులు ఎలా ఉంటాయో చూడాలి మరి.

 

Show comments