JC Diwakar Reddy: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. రాయలసీమను తెలంగాణలో కలపాలంటూ పేర్కొన్నారు జేసీ.. రాయలసీమను తెలంగాణలో కలుపుకోవాల్సిన అవసరం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి ఉందన్నారు. అసలు రాయల తెలంగాణ (రాయలసీమ, తెలంగాణ) కావడానికి ఎవరికీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.. ఈ విషయంపైనే నాయకులు అందరితో మాట్లాడుతున్నా.. నేతలను సమీకరిస్తున్నానని తెలిపారు. ఇక, ఎన్నికల తర్వాత వేదికపై ఉన్న నేతలందరిని కలుస్తానని ప్రకటించారు జేసీ దివాకర్‌రెడ్డి. రాయలసీమను తెలంగాణలో కలిపినప్పుడే రాయలసీమ సాగునీటి సమస్య తీరుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం.. కానీ, కలపడం సులభమని అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. తమ వాళ్లు ప్రత్యేక రాయలసీమ అంటున్నారు.. అది సాకారం అయితే మంచిదేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జేసీ దివాకర్‌రెడ్డి.
Read Also: Harish Rao: ఓటమి తప్పదు.. అందుకే అమిత్ షా ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడారు..
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనూ రాయల తెలంగాణ అనే డిమాండ్ వినిపించింది.. కొంత మంది సీమ నేతలు ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చారు.. కానీ, అది ఎక్కడా కార్యరూపం దాల్చలేదు.. కానీ, మరోసారి రాయల తెలంగాణ వాదనను జేసీ దివాకర్‌రెడ్డి తెరపైకి తేవడం సంచలనంగా మారిపోయింది. మరోవైపు.. ఆ మధ్య తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యక్షమైన జేసీ దివాకర్‌రెడ్డి.. తెలంగాణ వదిలిపెట్టి తాము నష్టపోయమాని.. సీఎల్పీలోనూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏపీ వదిలేసి.. తెలంగాణకు వస్తానని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసిన జేసీ.. ముఖ్యమంత్రి అయ్యాక తాను కేసీఆర్‌ని కలవలేదని.. అందుకే కలుద్దామని వచ్చినట్లు చెప్పారు. సీఎం బాగోగులు అడిగి తెలుసుకున్నానన్నారు జేసీ. తర్వాత కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ మీట్‌లోనే.. హీట్ పుట్టించే కామెంట్స్ చేశారు దివాకర్ రెడ్డి. ఏపీ కంటే తెలంగాణలో పాలన బాగుందని మెచ్చుకున్నారు. రాజకీయ అంశాలు పక్కనబెడితే.. తాను రాయల తెలంగాణ కోరుకున్నానని తెలిపారు.. రాష్ట్రం విడిపోయాక తాము నష్టపోయామని అప్పట్లో జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిపోయిన విషయం విదితమే.