Ruchika Singh: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూలై 23న జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. రుచికా సింగ్ అనే ఈ యువతి వీడియోలో.. తాను 15 ఏళ్ల బాలికనని, చేతులు జోడించి దేశ ప్రజలందరికీ క్షమాపణలు కోరుతున్నానని తెలిపింది. కన్నాట్ ప్లేస్‌లో తిరిగిన తర్వాత స్నేహితులతో కలిసి నిరసన ప్రదర్శన వద్దకు వెళ్లానని, అక్కడ ఉన్న వ్యక్తుల ప్రభావానికి లోనై ఆ విధమైన వ్యాఖ్యలు చేశానని ఆమె పేర్కొంది. వైరల్ వీడియోలో రుచికా మాట్లాడుతూ.. ఆ సమయంలో తాను ఇతరుల మాటలకు ప్రభావితమయ్యానని, తాను అన్న మాటలు క్షమించరానివని ఒప్పుకుంది. ఇది తన జీవితంలో మొదటి, చివరి తప్పిదమని, తన ప్రవర్తనకు తానెంతో సిగ్గుపడుతున్నానని చెబుతూ దేశ ప్రజలను క్షమించమని కోరింది.
శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోడీ స్పందిస్తూ.. నిరసన ప్రదర్శనలో తనను దూషించిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ క్షమాపణ వీడియో బయటకు రావడం గమనార్హం. తనపై, తన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించినప్పటికీ, యువతకు తమ తప్పుల నుంచి నేర్చుకునే అవకాశం ఇవ్వాలని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు జూలై 29న ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాజ్యాంగ పదవి గౌరవాన్ని భంగపరిచారనే ఆరోపణలపై నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్‌లో రుచికా సింగ్‌పై ‘జీరో ఎఫ్‌ఐఆర్’ నమోదైంది. భారతీయ ఛాయా సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం దీనిని ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
సమాచారం ప్రకారం రుచికా తన తల్లితో కలిసి నోయిడాలోని ఒక హౌసింగ్ సొసైటీలో నివాసముంటోంది. అయితే నిరసనల తర్వాత ఆమె తిరిగి రాలేదని, ప్రస్తుతం ఆ ఫ్లాట్ మూసివేసి ఉందని భద్రతా సిబ్బంది తెలిపారు. పోలీసులు కూడా అక్కడకు చేరుకుని స్థానికులను విచారించారు. కాగా, ఈ ఎఫ్‌ఐఆర్‌పై నిరసనలను నిర్వహించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుచిత భాషను తాము సమర్థించమని, అయితే ఇటువంటి వ్యాఖ్యలపై క్రిమినల్ కేసులు పెట్టడం వల్ల భావప్రకటనా స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం పడుతుందని పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ అభిప్రాయపడ్డారు. బాధితులు క్రిమినల్ చర్యలకు దిగకుండా మాననష్ట దావా వేసుకోవడం సరైన మార్గమని సూచించారు.

