Janasena: తన కూతురు సుగాలి ప్రీతి హత్య కేసులో న్యాయం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం అయ్యాక ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపించడం సంచలనంగా మారింది.. అయితే, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేయగా.. జనసేన పార్టీ కూడా సుగాలి ప్రీతి కేసుపై స్పందించింది.. సాయం చేసిన వారు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో… సాయం పొందిన వారు కృతజ్ఞత చూపకపోవడం అంతే తప్పు… అవుతుందని కౌంటర్ ఇచ్చింది.. అసలు పవన్ అనే వ్యక్తి నోరెత్తక పోతే సమాజంలో ప్రతీ రోజు జరిగే అనేక సంఘటనల్లాగా “సుగాలి ప్రీతి” అంశం కనుమరుగైపోయేది అనేది వాస్తవం అని పేర్కొంది జనసేన.. 2019 లో ఘోర పరాజయం పొందిన పార్టీ కార్యాలయానికి వచ్చి బాధితురాలి తల్లితండ్రులు వచ్చి ఘటన గురించి చెప్పిన వెంటనే చలించి స్పందించిన వ్యక్తి పవన్.. 2017 ఆగస్ట్ 18వ తేదీన జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసు వ్యవహారం 2019 డిసెంబర్ లో మొట్టమొదటి సారి పవన్ దృష్టికి వచ్చింది. ఆమె తల్లి పార్వతిదేవి.. పవన్ కళ్యాణ్ కలసి తమ బిడ్డ హత్య, తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఈ సందర్భంగాపవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి కేసుపై అసెంబ్లీలో చర్చించకుంటే కర్నూలు నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారని గుర్తుచేశారు..
Read Also: Tamil Nadu: ఆ డబ్బు దేవుళ్ళది.. ఆలయ నిధులను ప్రభుత్వం వాడుకోవద్దు: మద్రాస్ హైకోర్టు
ఇక, సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో 2020 ఫిబ్రవరి మొదటి వారంలో కర్నూలు వేదికగా నిరసన ర్యాలీ చేపట్టనున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు.. 2020 ఫిబ్రవరి 12వ తేదీన ర్యాలీ ఫర్ జస్టిస్ పేరిట కర్నూలు నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కోట్ల కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో కేసు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. సుగాలి ప్రీతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే కర్నూలు వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష చేపడతానిని హెచ్చరించారు. ఆడబిడ్డకు న్యాయం చేయకుండా కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ పెట్టి ఏం ఉపయోగం అంటూ ప్రశ్నించారు. కర్నూలు ర్యాలీ ఫర్ జస్టిస్ సభలో ప్రసగించిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి తమ సమస్యపై మొట్టమొదట గళం విప్పిన నాయకుడు పవన్ కల్యాణ్ అని ఎన్నోసార్లు చెప్పారు అని గుర్తుచేసింది జనసేన.. సుగాలి ప్రీతి హత్య కేసుపై పోరాటం మొదలు పెట్టిన నాటి నుంచి పవన్ ప్రతి పార్టీ సమావేశంలో, రాజకీయ సమావేశంలో ఆ అంశాన్ని లేవనెత్తుతూ గత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ఆయన పోరాటంతో సుగాలి ప్రీతి హత్య కేసు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఒత్తిడికి తలొగ్గి 2020 ఫిబ్రవరి 27వ తేదీన సుగాలి ప్రీతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో జారీ చేసిందని జనసేన పేర్కొంది..
Read Also: Kurnool: ప్రేమ జంటలే టార్గెట్.. ఏకాంతంగా కనిపిస్తే అంతే..!
అయితే, వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కల్యాణ్ దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసి చేతులు దులుపుకుంది. తదుపరి సీబీఐ విచారణ ముందుకు సాగలేదు అనే విషయాన్ని వెల్లడించింది జనసేన.. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగిన ప్రతి సందర్భంలోనూ, చివరికి 2024 సార్వత్రిక ఎన్నికల సభల్లోనూ సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ వచ్చారు. 2022లో మహిళా కమిషన్ ని తన ట్విట్టర్ ఖాతా వేదికగా సుగాలి ప్రీతి తల్లికి ఇంకా న్యాయం జరగలేదు. సీబీఐకి అప్పగించిన కేసు ఏమయ్యింది అంటూ ప్రశ్నించారు. 20.01 .2023లో నాగబాబు.. కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. పవన్ అధికారం చేపట్టిన వెంటనే కేసు దర్యాప్తుపై దృష్టి సారిస్తారని ఆయన హామీ ఇచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు తీసుకున్న వెంటనే సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం జరగలేదని తెలిసి క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన నామమాత్రపు సీబీఐ కి బదిలీ అంశంపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసు విచారణ పూర్తయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చి, విచారణ వేగవంతం అయ్యేలా చూడాలని హోంశాఖ మంత్రి అనిత సూచించారు. సుగాలి ప్రీతి తల్లితండ్రులను హోంశాఖ మంత్రి అనిత ని కలవాలని సూచించడంతో వారు కలిసి కేసు వివరాలు, ఘటన వివరాలు వివరించారు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి చొరవతో ఈ కేసు దర్యాప్తు ఇక్కడ వరకు వచ్చింది. పవన్ అనే వ్యక్తి మాట్లాడకపోతే ఇతర నాయకులు వదిలేసినట్టు వదిలేస్తే ఈ అంశం పై ఎవరూ మాట్లాడేవారు కాదు.. అలాంటిది ఈరోజు వచ్చి పవన్ ను ప్రశ్నిస్తాం.. న్యాయం చేయలేదు అని మాట్లాడుతుంటే.. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలా లేక అండగా ఉంటాం అని మాట ఇచ్చి మాటలు పడటం ఆయన చేసిన తప్పా అనేది అర్థం కావట్లేదు అంటూ పేర్కొంది జనసేన..
