Site icon NTV Telugu

Pawan Kalyan: ఏపీ రాజకీయాలపై ఎన్డీయే సమావేశంలో చర్చ జరగలేదు..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరగలేదని, దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ సమావేశం అనంతరం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. నాని ఫాల్కివాలా చెప్పినట్లు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గుండె ధైర్యంతో నిలబడడమే గొప్ప విషయమన్నారు. పార్లమెంట్ మీద తీవ్రవాదుల దాడి తర్వాత తనకు కూడా అదే అనిపించిందన్నారు. దేశానికి బలమైన నాయకత్వం అవసరం అనిపించిందన్నారు. 2014లో నరేంద్ర మోడీ నాయకత్వంతో దేశం మరింత పటిష్టమైందన్నారు. దేశానికి పటిష్ట నాయకత్వం వల్ల వచ్చే జరిగే మేలు ఏమిటి అన్నది భారతదేశం అంతా గమనిస్తోందన్నారు.

Also Read: Heavy Rains: ఇటు భారత్ నే కాదు.. అటు చైనాను వణికిస్తున్న భారీ వర్షాలు

ఎన్డీఏ పక్షాల సమావేశంలో భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. దేశ ప్రజలకు అత్యున్నత జీవన విధానం అందించేందుకు, అభివృద్ధి సాధించేందుకు ఎలాంటి విధానాలు తీసుకురావాలి అన్నదానిపై చర్చ జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులు, సీట్ల సర్దుబాటు మీద మాట్లాడలేదన్నారు. మొత్తం భారతదేశ రాజకీయాలు, భవిష్యత్తు వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. ఎన్డీయే కూటమిలో ఇప్పటికే 38 పార్టీలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయా? అని పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించగా రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అని సమాధానం ఇచ్చారు.

Exit mobile version