Janasena: మూడు రాజధానుల చుట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు పాదయాత్ర చేపట్టారు. మూడు రాజధానులకే మా మద్దతు అని వైసీపీ చెబుతుంది. ఇటీవల వైసీపీ విశాఖ గర్జన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల విశాఖ ఎయిరుపోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితుల్లో జనసేన నాయకులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇవాళ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ( పీఏసీ) మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం కానుంది. విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో అరెస్టులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటుపై సమాలోచనలు చేయనున్నట్లు సమాచారం. అలాగే జనసేన పార్టీ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Pawan Kalyan: ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవు.. రౌడీలు రాజ్యాలు ఏలకూడదు..!!
రాష్ట్రంలో పొత్తులపై కూడా ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో కలిసి ముందుకెళ్లాలా.. లేక టీడీపీ, బీజేపీ రెండింటితో కలిసి ముందుకెళ్లాలా అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశంలో ప్రాధాన్యత చోటుచేసుకుంది. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యుడు కె. నాగబాబు, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎత్తుగడలపై కూడా చర్చించనున్నారు. బస్సు యాత్ర వచ్చే ఏడాది నిర్వహించినా ముందుగా జిల్లాల పర్యటలను ప్రారంభించేందుకు పవన్ సిద్దమయ్యారు. దీనికి సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దింతో ఈ నెల 30న జనసేన పీఏసీ సమావేశం కీలక నిర్ణయాలకు వేదిక కానుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. విశాఖ ఘటనలో పలువురు జనసేన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కుటుంబాలను కూడా పవన్ కళ్యాణ్ కలవనున్నారు.
