NTV Telugu Site icon

Janasena: జగనన్న విద్యా కానుక కిట్లల్లో భారీ కుంభకోణం!.. జనసేన ఆరోపణలు

Janasena Party

Janasena Party

Janasena: జగనన్న విద్యా కానుక కిట్లల్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారంటూ జనసేన కీలక ఆరోపణ చేసింది. నాసిరకం జగనన్న విద్యా కానుక కిట్లను ప్రెస్ మీట్‌లో నాదెండ్ల మనోహర్ ప్రదర్శించారు. ఇవాళ్టి నుంచి రోజుకో స్కీంలో జరిగిన కుంభకోణాన్ని బయట పెడతామని గతంలోనే జనసేన ప్రకటించింది. జగన్ ప్రభుత్వం స్కాంలపై ఆధారాలతో సహా విమర్శలు చేశామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు

మేం ప్రస్తావించిన అంశాలపై జగన్ సమాధానం చెప్పలేదన్నారు. టోఫెల్, ఐబీ స్కాంలను బయటపెట్టామని.. జగనన్న పాల వెల్లువ పథకం పాపాల వెల్లువ అని ఆధారాలతో సహా వివరించామన్నారు. జగన్ పాల వెల్లువ పథకం అమలుపై క్షేత్ర స్థాయిలో పరిశీలనకు సిద్ధమని చెప్పినా మంత్రి సీదిరి ఏదేదో చెప్పారన్నారు. ఈ నెల 14 నుంచి రోజుకో శాఖలో జరుగుతున్న కుంభకోణం బయట పెట్టనున్నామని ఆయన వ్యాఖ్యానించారు. జగనన్న విద్యా కానుక పేరుతో మరో కుంభకోణం జరిగిందని.. రూ. 1050 కోట్లతో జగనన్న విద్యా కానుక పేరుతో కిట్లు పంచుతున్నామని ఈ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. ఇటీవల కాలంలో ఉత్తర భారతదేశంలో ఐదు కంపెనీలపై ఈడీ దాడులు చేశాయని.. ఉత్తర భారత దేశంలో ఈడీ దాడుల తీగ లాగితే ఉత్తరాంధ్ర నుంచి తాడేపల్లి ప్యాలెస్‌లోని డొంక కదిలిందన్నారు. నాసిరకం విద్యా కానుక కిట్లు సరఫరా చేసి.. ముడుపులు దండుకుంటున్నారని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

Also Read: Chinta Mohan: తెలంగాణ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ బీజేపీకి మద్దతిచ్చి తప్పు చేశారు..

ఐదు కంపెనీలతో సిండికేట్ ఏర్పాటు చేసి ఆ కంపెనీలకే విద్యాకానుక కిట్లు టెండర్లు కట్టబెట్టారన్నారు. రూ. 1050 కోట్ల టెండరును ఆ సిండికేట్‌కు కట్టబెట్టారని ఆయన విమర్శించారు. ఈ సిండికేట్ కంపెనీల్లోనే రూ. 120 కోట్లు దారి మళ్లినట్టు ఈడీ సోదాల్లో వెల్లడైందన్నారు. ఇప్పటి వరకు రూ. 2400 కోట్లు జగనన్న విద్యా కానుక నిమిత్తం ఖర్చు పెట్టారన్నారు. స్కూళ్లల్లో పిల్లలు 38 లక్షల మంది ఉంటే.. 42 లక్షల విద్యార్థులకు కిట్ల పంపిణీ నిమిత్తం కొనుగోలు ఆర్డర్లు ఇస్తున్నారన్నారు. పేద విద్యార్థులను.. వారి కుటుంబాలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు.జగన్ ప్రభుత్వం ఇసుకలోనో.. లిక్కరులోనో అవినీతి చేశారని అంతా భావిస్తున్నారన్నారు. కానీ ప్రతి స్కీంలోనూ ఈ ప్రభుత్వం అవినీతినే చూస్తోందని ఆయన విమర్శించారు.

Also Read: Kaleru Venkatesh: ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు..

పేద విద్యార్థులను గ్లోబల్ స్టూడెంట్లుగా తీర్చిదుద్దుతామనే పేరుతో మరో స్కాంకు తెర లేపారన్నారు. 32 వేల స్కూళ్లల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామంటూ మరో మోసానికి ఈ ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ పేరుతో మరో రూ. 400 కోట్ల స్కాంకు ప్రభుత్వ పెద్దలు ఒడిగట్టారన్నారు. పేద విద్యార్థుల పేరుతో అవినీతి జరుగుతోంటే జగన్ ఎందుకు సైలెంటుగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ ఇంటరాక్టిన్ ఫ్లాట్ ప్యానెళ్లను ఇంకా ఎందుకు సరఫరా చేయలేదన్నారు. మంత్రి వల్ల ప్యానెళ్లను సరఫరా చేయలేదా..? లేక ముఖ్య సలహాదారు వల్ల సరఫరా చేయలేకపోయారా అని ప్రశ్నలు గుప్పించారు. నాడు-నేడు పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. విద్యా శాఖ కోసం కేంద్రం నుంచి రూ. 6 వేల కోట్ల వచ్చాయన్నారు. ఆ నిధులతో నాడు-నేడు పనులు చేయడం లేదన్నారు.

నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “కేంద్రంతో పాటు వివిధ సంస్థల నుంచి గ్రాంట్లు, లోన్లు రూపంలో రూ. 6 వేల కోట్లు విద్యా శాఖకు వచ్చాయి. రూ. 6 వేల కోట్లు ఏపీ విద్యా శాఖకు వస్తే.. రూ. 3850 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మిగిలిన రూ. 2150 కోట్లు ఏమయ్యాయి..?. పేద విద్యార్థుల నిమిత్తం కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం ఏం చేసింది..? విద్యా శాఖలో కాంట్రాక్టర్లకు రూ. 1300 కోట్లు బిల్లులు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉంది. విద్యా శాఖకు బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. 8022 ఇంగ్లిష్ ల్యాబుల నిర్మాణం చేస్తామని చెప్పి.. ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఇంత మోసమా..? ఇంత దగానా..? విద్యా శాఖకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎక్కడికి పోయాయి..? మేం బయట పెడుతోన్న కుంభకోణాలను జనసేన – టీడీపీ కలిసి ప్రజలకు వివరిస్తాం.” అని నాదెండ్ల పేర్కొన్నారు.