NTV Telugu Site icon

Pawan Kalyan Meets Amit Shah: ఢిల్లీలో పవన్‌ కల్యాణ్‌ మకాం.. అమిత్‌షాతో భేటీ

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan Meets Amit Shah: ఎన్డీఏ పక్షాల సమావేశానికి హస్తినకు వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. అక్కడే మకాం వేశారు.. కేంద్ర ప్రభుత్వంలోని కీలక నేతలు, బీజేపీ పెద్దలతో సమావేశాలు అవుతున్నారు.. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. నిన్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన.. వరుసగా బీజేపీ పెద్దలను కలుస్తుండగా.. అందులో భాగంగా అమిత్‌షాతో సమావేశమై.. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపూ చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఇక, రేపు కూడా ఢిల్లీలోనే పవన్ కల్యాణ్‌ ఉండే అవకాశం ఉండగా.. ఇంకా ఎవరెవరిని కలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పొత్తుల విషయంపై బీజేపీ పెద్దలతో పవన్‌ కీలక చర్చలు జరుపుతున్నారు..

అయితే, ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరుగుతుందని భావించినా అది జరగలేదు. కేవలం జాతీయ అంశాలకే ఎన్డీఏ భేటీ పరిమితం అయ్యింది.. దీంతో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. ఢిల్లీలోనే మకాం వేశారు.. బీజేపీ పెద్దల్ని కలుస్తూ.. పొత్తుల అంశంపై చర్చిస్తున్నారు.. ఇప్పటికే ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉండగా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయనే భావన ఉంది.. ఆ దిశగా పవన్‌ కల్యాణ్ ప్రయత్నాలు సాగిస్తున్నారనే చర్చ సాగుతోంది.. ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన-బీజేపీకి కలిగే ఉపయోగాలని కూడా బీజేపీ పెద్దల దృష్టికి పవన్ తీసుకెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి పవన్‌ కల్యాణ్‌ ఇంకా ఎవరెవరిని కలుస్తారు.. ఎలాంటి చర్చలు జరుగుతాయి.. ఏపీలో పొత్తులపై ఎలాంటి నిర్ణయం వెలువడనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో జరిగిన సమావేశంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. గౌరవనీయులైన హోం మంత్రి శ్రీ అమిత్ షా జీతో అద్భుతమైన సమావేశం జరిగింది. ఈ పరస్పర చర్య ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక మరియు సుసంపన్నమైన భవిష్యత్తుకు దారితీస్తుందని నేను ఖచ్చితంగా అమ్ముతున్నాను అని కామెంట్‌ పెట్టిన పవన్‌.. జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో కలిసి అమిత్‌షాతో సమావేశమైన ఫొటోలను కూడా జత చేశారు.