Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరిలో జనసేన పార్టీ కొత్త కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు పార్టీ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, ఇన్చార్జ్ దేవర మనోహర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పట్టణవ్యాప్తంగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నాగాలమ్మ దేవాలయం నుంచి కొత్త కార్యాలయం వరకు కొనసాగింది. పార్టీ కార్యకర్తలు, స్థానిక జనసేన అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.
Read Also: SRH vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఎస్ఆర్హెచ్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. జనసేన పార్టీ దేశంలోనే 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీగా నిలిచిందని గర్వంగా ప్రకటించారు. కుల, మత, వర్గ విభేదాలను వదిలిపెట్టి ప్రజల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు సాగాలని, పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే గెలుపుకోసం కసరత్తు ప్రారంభించాలన్నారు. జనసేన సిద్ధాంతాలు, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యకర్తలు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.