Jammu Kashmir Cloudburst: జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. దోడా జిల్లాలో భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడడం, రాళ్లు పడడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో అనేక చోట్ల అధికారులు రహదారులన్నీ మూసివేశారు. దోడా జిల్లాలోని థాత్రి సబ్ డివిజన్‌లో క్లౌడ్ బరస్ట్ కావడంతో విపత్తు సంభవించింది. ఈ ఘటనలో 10కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. కఠువా, కిశ్త్‌వాడ్‌లోనూ ఇటువంటి విపత్తులే సంభవించాయి.
గతంలో కిష్త్వార్, థరాలిలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కిష్త్వార్ జిల్లా దోడాలోని అనేక ప్రాంతాలలో మేఘాలు ఒక్కసారిగా పేలినట్లు నివేదికలు పేర్కొన్నాయి. డిప్యూటీ కమిషనర్ హర్విందర్ సింగ్ మాట్లాడుతూ.. మూడు రోజులుగా నిరంతరం వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. రెండు చోట్ల, ముఖ్యంగా చీనాబ్ నది ప్రాంతాలలో మేఘావృతం సంభవించినట్లు చెప్పుకొచ్చారు. మేఘావృతం కారణంగా NH-244 కూడా కొట్టుకుపోయిందని వెల్లడించారు. ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారని.. 15 ఇళ్ళు, గోశాలలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు.
Also Read: Rohit Sharma: ఓ పథకం ప్రకారం.. రోహిత్‌ను టీమ్ నుంచి తప్పించాలనుకుంటున్నారు!
జమ్మూ రీజియన్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కఠువా, సాంబా, డోడా, జమ్మూ, రాంబన్, కిశ్త్‌వాడ్ జిల్లా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విపత్కర వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆగస్ట్ 27వరకు క్లౌడ్ బరస్ట్‌లు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో సహాయక బృందాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు.
