Site icon NTV Telugu

Anirudh Reddy vs KTR: వసూళ్లు, కమీషన్స్, కబ్జాల కోసం కాదు.. కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే కౌంటర్!

Anirudh Reddy Vs Ktr

Anirudh Reddy Vs Ktr

‘ప్రతిదీ రాజకీయం చేయొద్దు’ అంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూపైన మాట్లాడరా?, తన ప్రజలకు కావాల్సిన అంశంపై ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా? అని ప్రశ్నించారు. తాను పోరాటం చేసేది రైతుల కోసం, జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం అని స్పష్టం చేశారు. మీ ఎమ్మెల్యేల మాదిరి తాను వసూళ్లు, కమీషన్స్, కబ్జాల కోసం పని చేయను అని కేటీఆర్‌ను జడ్చర్ల ఎమ్మెల్యే విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పోస్ట్ చేశారు.

‘కేటీఆర్ గారు ప్రతిదీ రాజకీయం చేయొద్దు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడరా, తన ప్రజలకు కావాల్సిన అంశంపై ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా?. మా పార్టీలో, మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ. మీ పాలన నిరంకుషత్వ పాలన. మీ రౌడీయిజం అరాచకత్వ పాలన చూడలేకనే ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని మిమ్మల్ని బొంద పెట్టారు. నేను పోరాటం చేసేది రైతుల కోసం, నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం. మీ ఎమ్మెల్యేల లాగా రౌడీయిజం చేసి ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్ల, భూకబ్జాల కోసం నేను పనిచేయనని మీరు గమనించాలి. నేను చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల కోసం ఫైట్ చేస్తున్నా. మీ మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా.. వాళ్లకు కమీషన్ వస్తే చాలని ఎప్పుడు కూడా ఈ సమస్య పై మాట్లాడలేదని మీరు గుర్తించాలి’ అని కేటీఆర్ ట్వీట్‌కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రిప్లై ఇచ్చారు.

Also Read: DGP Shivadhar Reddy: పోలీస్ శాఖలో 17 వేల పోస్టులు భర్తీ చేస్తాం!

‘స్థానిక సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదని పత్రికలకెక్కుతాడు పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే!. భారీవర్షాల వల్ల నియోజకవర్గంలో నష్టం వాటిల్లితే రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తలేదని ఏకంగా ప్రపంచబ్యాంకుకే ఉత్తరం రాసి నవ్వులపాలవుతాడు ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే!. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సరిగ్గా పనిచేస్తలేదు కాబట్టి పరిశ్రమనే తగులబెడతానని బెదిరించి రౌడియిజం చేస్తాడు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే!. అంతులేని అరాచకత్వమూ, అపరిమితమైన అజ్ఞానమూ రాజ్యమేలుతున్నాయి నేడు తెలంగాణలో. సర్కారు కాదిది సర్కసే!’ అని అంతకుముందు కేటీఆర్ ట్వీట్ చేశారు.

Exit mobile version