NTV Telugu Site icon

Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్.. భారత్‌ చరిత్ర సృష్టించాలంటే అది జరగాలి..

Isro

Isro

Chandrayaan 3: భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపింది చంద్రయాన్-3 ప్రయోగం. చంద్రమండలంపై పరిశోధన కోసం ఇస్రో ప్రయోగించిన బాహబలి రాకెట్ చంద్రయాన్-3. అందరి అంచనాలకు తగ్గట్టుగానే విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సరిగ్గా మధ్యాహ్నం 2.35 నిమిషాలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది LVM-3 M4 రాకెట్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఈ అద్భుత ప్రయోగాన్ని టీవీల ద్వారా వీక్షించారు.

చంద్రయాన్-3 రాకెట్ మూడు దశల్లో సపరేషన్ పూర్తైంది. నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాలకు భూకక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 24 రోజుల పాటు మాడ్యుల్‌ భూమిచుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. తర్వాత క్రమంగా కక్ష్యను పెంచుతారు. తర్వాత చంద్రుడి దిశగా పయనమవుతుంది. చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి ప్రవేశించాక లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ ప్రక్రియ జరుగుతుంది. అప్పటినుంచి అది చందమామ కక్ష్యలో తిరుగుతుంది. ఆగస్టు 23 లేదా 24న ప్రొపెల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోతుంది. గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లివైపు దూసుకెళుతుంది. ఆ తర్వాత నాలుగు ఇంజన్లు మండించి వేగాన్ని తగ్గిస్తారు. జాబిల్లిని తాకే సమయంలో ల్యాండర్‌ వేగం సెకనుకు 2 కిలో మీటర్ల పడిపోతుంది. ఉపరితలాన్ని బలంగా తాకినా తట్టుకునేలా ల్యాండర్‌ డిజైన్‌ను మార్చారు.

రోవర్ ల్యాండింగ్‌కు ఇస్రో కష్టసాధ్యమైన ప్రాంతాన్ని ఎంచుకుంది. మిగిలిన దేశాలకు సాధ్యంకాని దక్షిణ ధ్రువాన్ని టార్గెట్ చేసింది. ఇప్పటిదాకా చంద్రుడి మధ్యరేఖా ప్రాంతాన్ని ఎంచుకుంటే ఇస్రో మాత్రం దక్షిణ ధృవ ప్రాంతాన్ని సెలక్ట్ చేసింది. అంతా సవ్యంగా జరిగితే 41 రోజుల తర్వాత రోవర్ చంద్రుడిపై అడుగుపెడుతుంది. అదే జరిగితే చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేసిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా నిలుస్తుంది. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ తో ఇస్రోలో శాస్త్రవేత్తల సంబరాలు అంబరాన్ని తాకాయి.

కాగా, 2008 అక్టోబర్ 22న చంద్రయాన్-1 ప్రయోగం జరిగింది. అది జాబిల్లి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించింది. 2019 జూలై 22న చంద్రయాన్‌-2ను ప్రయోగించారు. ప్రయోగం సక్సెస్‌ అయిందనుకున్న తరుణంలో ఆఖరు రెండు నిమిషాల్లో ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టడంతో సంకేతాలు ఆగిపోయాయి. ఆ ప్రయోగం నుంచి పాఠాలు నేర్చుకుని ఈసారి మరిన్ని జాగ్రత్తలతో చంద్రయాన్-3ని ప్రయోగించారు. చంద్రయాన్-3 విజయవంతంగా కక్ష్యలోకి చేరడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి, ప్రధాని సహా కోట్లాదిమంది ప్రజలు ఇస్రోకు అభినందనలు తెలిపారు. దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.