NTV Telugu Site icon

SpaDeX Docking Update: మూడు మీటర్ల దూరంలో స్పేడెక్స్‌ ఉపగ్రహాలు..

Spadex Docking

Spadex Docking

SpaDeX Docking Update: అంతరిక్షంలో డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను కనబరుస్తున్నాయి. తాజాగా స్పేడెక్స్‌ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నాయని ఇస్రో ప్రకటించింది. ఈ విషయాన్ని తాజాగా ఇస్రో ఎక్స్‌లో పోస్టు చేయడం ద్వారా వెల్లడించింది. ఈ ఉపగ్రహాలను 15 మీటర్ల దూరం వరకు తీసుకువచ్చి, ఆ తర్వాత ఆ దూరాన్ని కేవలం 3 మీటర్లకు తగ్గించినట్లు తెలిపింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం, రెండు ఉపగ్రహాలను సురక్షితమైన దూరానికి తీసుకువెళ్లినట్లు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం ఇస్రో డాకింగ్‌ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన డేటాను విశ్లేషించనుంది.

Also Read: Jai Shankar: అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్న విదేశాంగ మంత్రి

ఇందుకు సంబంధించిన స్పేడెక్స్‌ ఉపగ్రహాల ఫోటోలను కూడా ఎక్స్‌లో షేర్‌ చేసింది ఇస్రో. ఆదివారం తెల్లవారు జామున 3.10 గంటలకు మొదటిగా ఈ ఉపగ్రహాలను 105 మీటర్ల దగ్గరికి తీసుకువెళ్లారు. ఈ ప్రక్రియ అనంతరం ఉపగ్రహాలు డాకింగ్‌ కోసం సిద్ధంగా ఉన్నాయని ఇస్రో తెలిపింది. డాకింగ్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎస్‌డీఎక్స్‌01 (ఛేజర్‌), ఎస్‌డీఎక్స్‌02 (టార్గెట్‌) ఈ రెండు ఉపగ్రహాలను డిసెంబర్‌ 30, 2024న పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా 475 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

డాకింగ్‌ ప్రక్రియ కోసం జనవరి 7, 9 తేదీల్లో అనుసంధాన ప్రయత్నాలు జరగాల్సి ఉన్నా, అనుకోని కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడింది. అయితే, ప్రస్తుతం ఈ ప్రక్రియ మళ్లీ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉపగ్రహాలు ‘హోల్డ్‌’ దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, అంతరిక్షంలో డాకింగ్‌ ప్రక్రియలో భారత పనితనాన్ని ప్రపంచం ముందు చాటిచెప్పినట్టవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇస్రో అత్యాధునిక అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేయడంలో మరో కీలక మైలురాయిని సాధించింది.

Show comments