Site icon NTV Telugu

ISRO: చరిత్ర సృష్టించిన ఇస్రో.. 100వ మిషన్ విజయవంతం

Isro

Isro

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన అంతరిక్ష ప్రయోగాలలో మరో చరిత్రను సృష్టించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగంలోజీఎస్ఎల్వీ-ఎఫ్15 (GSLV-F15)రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-02 (NVS-02) ను కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్వీఎస్-02 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ (నావిక్) విస్తరణలో కీలక పాత్ర పోషించనుంది. దీని మొత్తం బరువు 2,250 కిలోలు ఉండగా.. 10 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. ఉపగ్రహం జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశించడంతో భారత నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

Also Read: Mahakumbh 2025 : 16 రోజుల్లో 15 కోట్ల మంది పుణ్యస్నానాలు… నేడు మహా కుంభమేళాలో రికార్డు ఖాయం

ఇస్రో ఛైర్మన్‌గా నారాయణన్‌కు ఇదే తొలి ప్రయోగం కాగా, ఇది విజయవంతం కావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ ఈ ప్రయోగం ఇస్రో విజయయాత్రలో మరో గొప్ప ఘట్టమని తెలిపారు. శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10న నింగిలోకి ప్రయాణించగా, దాదాపు 46 ఏళ్ల తర్వాత 100వ ప్రయోగాన్ని చేపట్టి ఘనత సాధించింది. గత నాలుగు దశాబ్దాల్లో ఇస్రో అనేక కీలక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

జీఎస్ఎల్వీ-15 రాకెట్‌ను ఒకప్పుడు ఇస్రో ‘నాటీ బాయ్’ అని పిలిచేది. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం 16 ప్రయోగాల్లో 6 సార్లు ఫెయిల్ అయ్యింది. 37% ఫెయిల్యూర్ రేటు ఉన్నా కూడా ఇస్రో శాస్త్రవేత్తలు నమ్మకంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రయోగంతో ఇస్రో భారత అంతరిక్ష పరిశోధనలో మరొక కీలక మైలురాయిని చేరుకుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలతో అంతరిక్ష రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని మరింత పెంచుకోనుంది.

Exit mobile version