NTV Telugu Site icon

Israel-Hamas War: హమాస్ కీలక కమాండర్లను హతమార్చిన ఇజ్రాయిల్.. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిపై దాడి..

Gaza

Gaza

Israel-Hamas War: హమాస్ మిలిటెంట్ సంస్థను పూర్తిగా నాశనం చేసేదాకా ఇజ్రాయిల్ నిద్రపోయే పరిస్థితి కనిపించడం లేదు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది హమాస్. ఆ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీ పౌరులను ఊచకోత కోసింది. 200 మందిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) నిప్పుల వర్షం కురిపిస్తోంది. భూతల దాడులతో విరుచుకుపడుతోంది.

తాజాగా గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిపై ఇజ్రాయిల్ బలగాలు దాడి చేశాయి. ఈ దాడిలో 13 మంది మరణించినట్లు గాజాలోని హమాస్ ప్రభుత్వం, అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్ చెప్పారు. అయితే ఈ దాడిపై ఇజ్రాయిల్ వెంటనే స్పందించలేదు. గురువారం ఇజ్రాయిల్ ఈ ఆస్పత్రి సమీపంలో భారీ పోరాటం చేసింది. పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్లను చంపింది. హమాస్‌కి కీలక స్థావరాలుగా ఉన్న సొరంగాలను నాశనం చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది. హమాస్ ఆస్పత్రి మాటున కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఇజ్రాయిల్ సైన్యం ఆరోపిస్తోంది. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 10,500 మంది కన్నా ఎక్కువ మంది పాలస్తీనియన్లు చనిపోయారు.

Read Also: Google: వచ్చే నెలలో మిలియన్ సంఖ్యలో Gmail అకౌంట్ల తొలగింపు.. నివారించడం ఎలాగంటే..?

మరోవైపు ఇజ్రాయిల్ భూతల దాడి తీవ్రంగా కొనసాగిస్తోంది. తమ సైన్యం అనేక మంది హమాస్ ఉగ్రవాదుల్ని మట్టుపెట్టినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఇందులో అక్టోబర్ 7 నాటి దాడిలో కీలకంగా ఉన్న హమాస్ స్పెషన్ ఫోర్స్ ‘నఖ్బా’కి చెందిన కీలక కమాండర్లు ఉన్నట్లు వెల్లడించింది. షిన్‌బెల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇచ్చిన నిఘా సమాచారం మేరకు జబాలియా ప్రాంతంలో ఐడీఎఫ్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో నఖ్బా కీలక కమాండర్లు అహ్మద్ మౌసా, అమర్ అలహంది హీమైనట్లు తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ ఆర్మీ పోస్ట్, జికిమ్ బేస్‌పై దాడికి మౌసా నాయకత్వం వహించినట్లు ఐడీఎఫ్ తెలిపింది.

యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ససేమిరా అంటున్నారు. గాజాలోని చివరి హమాస్ మిలిటెంట్‌ని హతం చేసే వరకు యుద్ధం ఆపేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు తమకు గాజాను ఆక్రమించాలనే ఉద్దేశం లేదని కూడా వెల్లడించారు. ఇప్పటికే ఉత్తర గాజాలోని ప్రజల్ని సురక్షితమైన దక్షిణ ప్రాంతానికి వెళ్లాల్సిందిగా ఇజ్రాయిల్ ఆదేశించింది. దీంతో భారీగా వలసలు పెరిగాయి. గాజాలో తీవ్ర మానవతా సంక్షోభం ఏర్పడింది.

Show comments