Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా స్ట్రిప్‌పై భూతల దాడి చేస్తున్న ఇజ్రాయిల్ బలగాలు హమాస్ వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు గాజాను అదుపులోకి తీసుకునేందుకు ఆపరేషన్స్ చేపడుతోంది. ముఖ్యంగా గాజాలోని ఉత్తర ప్రాంతంపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే హమాస్ పార్లమెంట్‌తో పాటు హమాస్ నియంత్రణలో ఉన్న ఓడరేవును ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకుంది.
ఇదిలా ఉంటే గురువారం రోజున ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ లోని 4 పట్టణాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను ఆదేశించింది. ఈ ఆదేశాలతో గాజాలోని సురక్షిత ప్రాంతాలకు కూడా యుద్ధం విస్తరించే అవకాశం కనిపిస్తోంది. హమాస్ కమాండ్ సెంటర్‌గా ఉందని అనుమానిస్తున్న గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్-షిఫా ఆస్పత్రిని ఇప్పటికే ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది.
ఇదిలా ఉంటే దక్షిణ ప్రాంతంలోని నగరాలైన ఖాన్ యూనిస్‌కి తూర్పున ఉన్న బని షుహైలా, ఖుజా, అబాసన్, కరారా పట్టణాలను విడిచి వెళ్లాలని రాత్రిపూట విమానాల ద్వారా కరపత్రాలను జారవిడిచారు. లక్ష కంటే ఎక్కువ మంది జనాభా ఉంటే ఈ పట్టణాల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉత్తర గాజా నుంచి వలస వచ్చిన ప్రజలకు ఇన్నాళ్ల నుంచి ఆశ్రయం కల్పిస్తున్న ఈ పట్టణాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. మీ భద్రత కోసం, మీరు మీ నివాస స్థలాలను వెంటనే ఖాళీ చేసి షెల్టర్లకు వెళ్లాలి అని ఇజ్రాయిల్ పేర్కొంది. ఈ ప్రాంతంలో రాత్రిపూట బాంబు పేలుళ్లు జరిగాయని స్థానికులు తెలిపారు.
Read Also: India Vs New Zealand: ఆకాశంలో విమానం.. లైవ్ స్కోర్ అప్డేట్స్ అందించిన ఇండిగో పైలెట్.. ట్వీట్ వైరల్..
యుద్ధ ప్రారంభమైన తొలిరోజుల్లో హమాస్ ఉగ్రవాదులకు కేంద్రంగా ఉన్న ఉత్తర గాజా, గాజా నగరాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ ఆదేశించింది. ప్రజల్ని హమాస్ ఉగ్రవాదులు మానవ కవచాలుగా ఉపయోగించుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది. మానవతా కారిడార్లు ఓపెన్ చేసి ప్రజలు దక్షిణ ప్రాంతానికి వెళ్లేందుకు సహకరించింది. గాజాలోని 23 లక్షల మందిలో మూడింత రెండోవంతు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల్లో 1400 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై భీకరంగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 11 వేల మంది పాలస్తీనియన్ ప్రజలు మరణించారు. అయితే గాజాలోని ఆస్పత్రులను హమాస్ తమ కమాండ్ సెంటర్లుగా ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయిల్ సాక్ష్యాలతో బహిర్గతం చేసింది. ఆస్పత్రి కింద ఉన్న టన్నెల్ వ్యవస్థలో సౌకర్యాలను బయట పెట్టింది. పేలుడు పదార్థాలు, గన్స్, ల్యాప్ టాపులను ఇందులో గుర్తించింది. మరోవైపు యుద్ధం తర్వాత అక్కడ హమాస్ మళ్లీ పుట్టకుండా అక్కడ చాలా బలమైన శక్తి ఉండాల్సిన అవసరం ఉందని ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ అన్నారు.