Israel War: ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు భీకరదాడికి పాల్పడ్డారు. బలమైన సైన్యం, టెక్నాలజీ, మెస్సాద్ వంటి ఇంటెలిజెన్స్ సంస్థ ఉన్నప్పటికీ.. ఇలాంటి దాడిని ఊహించలేకపోయింది. అంత పకడ్భందీగా హమాస్ గాజా నుంచి కేవలం నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించింది. గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన హమాస్ మిలిటెంట్లు పెద్ద సంఖ్యలో ఇజ్రాయిలీలను హతమార్చారు. సరిహద్దు ప్రాంతాల్లోని పట్టణాల్లో ఇంటింటికి వెళ్తూ హత్యలు చేశారు. చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా చంపేశారు. ఇలాంటి దాడితో ఇజ్రాయిల్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. గాజా స్ట్రిప్‌పై విస్తృతంగా వైమానిక దాడుల్ని చేస్తోంది. హమాస్ దాడిలో 1000 మంది ఇజ్రాయిల్ ప్రజలు చనిపోయారు. ఇక గాజా వైపు 700 మంది ప్రజలు మరణించారు.
ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే పలు దేశాలు ఇరు వైపులా మద్దతు ప్రకటిస్తున్నాయి. ఆ దేశాలేంటో చూద్ధాం..
ఇజ్రాయిల్‌కి మద్దతిస్తున్న దేశాలు ఇవే..
భారత్:
భారత్ ఇప్పటికే ఇజ్రాయిల్ కి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ప్రధాని మంగళవారం ఇజ్రాయిల్ ప్రధాని జెంజిమెన్ నెతన్యాహుతో మాట్లాడారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందే అని స్పష్టంగా తెలియజేశారు. అంతకుముందు ఇజ్రాయిల్ దాడి షాక్‌కి గురిచేసిందని ఆయన ట్వీట్ చేశారు
అమెరికా:
అగ్రరాజ్యం అమెరికా కూడా ఇజ్రాయిల్ దేశాని మద్దతుగా నిలిచింది. ఇజ్రాయిల్ కి కావాల్సిన మందు గుండు సామాగ్రి, ఫైటర్ జెట్లను, సైనికులను పంపించేందుకు సిద్ధమైంది.
యూకే:
యూకే కూడా ఇజ్రాయిల్‌కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయిల్ తనను తాను రక్షించుకునే సంపూర్ణ హక్కు కలిగి ఉందని ఆ దేశం ప్రకటించింది.
ఫ్రాన్స్:
హమాస్ దాడిని ఫ్రాన్స్ అద్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ఖండించారు. ఇజ్రాయిలీల రక్షణ, హక్కుల్ని కాపాడేందుకు ఫ్రాన్స్ తనవంతు కృషి చేస్తుందని మాక్రాన్ వెల్లడించారు. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్ జాగ్ తో, ప్రధాని నెతన్యాహూతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు.
ఆస్ట్రేలియా:
ఇజ్రాయిల్ కి తన మద్దతు ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ తెలిపారు. అయితే గాజాలో ఉన్న సాధారణ పౌరులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన హమాస్‌ని ఉపేక్షించవద్దని చెప్పింది.
నార్వే:
హమాస్ ఉగ్రదాడిని నార్వే ఖండించింది. ఈ దేశ విదేశాంగ మంత్రి అన్నికెన్ హుయిట్‌ఫెల్డ్ నెల రోజుల క్రితమే ఇజ్రాయిల్, పాలస్తీనా అదికారులతో సమావేశమయ్యారు. ఇంతలోనే ఇంతటి ఘోరం జరగడం బాధకరమని అన్నారు.
జర్మనీ:
జర్మనీ కూడా ఇజ్రాయిల్ కి మద్దతు తెలిపింది. దాడి జరిగిన తర్వాత ఆ దేశ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ దాడిని తీవ్రంగా ఖండించారు.
ఈ దేశాలే కాకుండా ఆస్ట్రియా, కెనడా, స్పెయిన్, యూరోపియన్ యూనియన్ ఇజ్రాయిల్‌కి మద్దతు తెలిపాయి.
పాలస్తీనా-హమాస్‌కి మద్దతు ఇస్తున్న దేశాలు ఇవే..
ఇరాన్:
ఇజ్రాయిల్ బద్ధ శత్రువగా ఇరాన్ భావిస్తుంటుంది. ఈ రెండు దేశాలు ఉప్పునిప్పుగా ఉంటాయి. తమ మద్దతు హమాస్ కి ఉందని మొదటగా ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ సుప్రీంలీడర్ సలహాదారు ఏకంగా ఈ దాడి గర్వంగా ఉందని హమాస్ తీవ్రవాద దాడుల్ని మెచ్చుకున్నాడు. ఇక ఈ దాడిలో ఇరాన్ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ ఇరాన్ ప్రమేయాన్ని ఖండించారు.
సౌదీ అరేబియా:
సౌదీ అరేబియా పరిస్థితి మింగలేక కక్కలేక అనేలా ఉంది. ఇజ్రాయిల్-సౌదీల మధ్య సంబంధాలు బలపడుతున్నాయనే సమయంలో ఈ దాడి జరిగింది. నిజానికి ఇటు సౌదీకి, ఇజ్రాయిల్‌కి ఇరాన్ ఉమ్మడి శత్రువు. సౌదీ-యూఏస్ఏ-ఇజ్రాయిల్ మధ్య సైనిక, వాణిజ్య ఒప్పందాలు కుదిరే ఈ సమయంలోనే హమాస్ దాడి జరిగింది. అయితే ఒకవైపు హమాస్ కు మద్దతు ఇస్తూనే.. ఇజ్రాయిల్‌ని దూరం చేసుకోవాలని సౌదీ చూడటం లేదు.
యెమెన్:
ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌ని ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఇరాన్ దారిలో యెమెన్ కూడా నడుస్తోంది. హమాస్ కి మద్దతు ఇస్తోంది.
దక్షిణాఫ్రికా:
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో దక్షిణాఫ్రికా హమాస్ పక్షాల నిలిచింది. అక్కడ అధికారంలో ఉన్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ హమాస్ కి మద్దతుగా ప్రకటి చేసింది. హమాస్ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యకరంగా లేదని.. ఇజ్రాయిల్ ఆక్రమణ కారణంగా ఈ దాడులు జరినట్లు పేర్కొంది.
ఖతార్:
గతంలో తాలిబాన్లను వెనకేసుకుని వచ్చిన ఖతార్, హమాస్‌కి మద్దతుగా నిలుస్తోంది. పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ అణిచివేత కారణంగానే ఈ దాడి జరిగిందంటూ వ్యాఖ్యానించింది. ఈ దాడులకు ఇజ్రాయిల్ కారణం అంటూ హమాస్‌కి మద్దతుగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమవుతోంది.
వీటితో పాటు ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్ దేశాలు కూడా హమాస్‌కి మద్దతు నిలుస్తున్నాయి.
