Is US Governing Venezuela Legal: వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అమెరికా అదుపులోకి తీసుకోవడం, అలాగే “ఇప్పటివరకు వెనిజువెలాను మేమే పాలిస్తాం” అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. అంతర్జాతీయ న్యాయం, అమెరికా అధ్యక్ష అధికారాల విషయంలో తీవ్రమైన చట్టపరమైన ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చాయి. అయితే ఈ చర్యలకు సంబంధించిన చట్టబద్ధ కారణాలను ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. అయితే గతంలో జరిగిన సంఘటనలు, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు కొన్ని సంకేతం ఇస్తున్నాయి. 1989లో అమెరికా పనామాపై దాడి చేసి అక్కడి పాలకుడు మాన్యువల్ నోరియేగాను పట్టుకుంది. అప్పట్లో నోరియేగా కూడా అమెరికాలో డ్రగ్ కేసుల్లో నిందితుడే. ఇప్పుడు మడురో విషయంలోనూ పెంటగాన్ ఇదే తరహా వివరణ ఇస్తోంది.
READ MORE: Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వారా దర్శనాలు.. 3.74 లక్షల మందికి దర్శనం పూర్తి
అయితే వెనిజువెలాను అమెరికా పాలించడం చట్టబద్ధమా? అనేది ఇప్పుడు అందరి మదిలో మొదలైంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. విలేకరుల సమావేశంలో “వెనిజువెలాను మేమే నడుపుతాం” అని చెప్పిన కొద్ది సేపటికే, ట్రంప్ తన అసలు ఉద్దేశం ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్‌పై ఒత్తిడి తేవడమేనని అని స్పష్టమైంది. ఆమె అమెరికా ఆదేశాలు పాటిస్తే సైన్యం అవసరం ఉండదని ట్రంప్ వెల్లడించారు. ఆమె అంగీకరించకపోతే ఏం చేస్తారన్న దానిపై ట్రంప్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీనిపై అంతర్జాతీయ న్యాయ నిపుణులు, జాతీయ భద్రతా చట్ట నిపుణులు అయోమయంలో పడ్డారు. కార్డోజో లా స్కూల్ ప్రొఫెసర్ రెబెక్కా ఇంగ్బర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. వెనిజువెలాను అమెరికా పాలించేందుకు ఎలాంటి చట్టపరమైన మార్గం తనకు కనిపించడం లేదన్నారు. ఇది అంతర్జాతీయ న్యాయ ప్రకారం అక్రమ ఆక్రమణలా ఉందని, అమెరికా దేశీయ చట్టాల్లోనూ అధ్యక్షుడికి అటువంటి అధికారం లేదని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు, అలా చేయాలంటే కాంగ్రెస్ నుంచి నిధులు కూడా అవసరం అవుతాయని చెప్పారు. పనామా ఉదాహరణను చూస్తే అది పూర్తిగా సరిపోలదని నిపుణులు చెబుతున్నారు. 1989లో నోరియేగా పడిపోయిన తర్వాత, ఎన్నికల్లో గెలిచిన గిల్లెర్మో ఎండారా పనామా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దేశాన్ని ఆయనే నడిపారు. అమెరికా సహకరించింది గానీ, పనామాను తామే పాలిస్తామని ప్రకటించలేదు.
మడురోను పట్టుకోవడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమా?
ఇదే కాదు.. మడురోను పట్టుకోవడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమా? అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే, ఇది ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధంగా కనిపిస్తోంది. ఐరాస చార్టర్‌లోని ఆర్టికల్ 2(4) ప్రకారం, మరో దేశ భూభాగంలో ఆ దేశ అనుమతి లేకుండా లేదా ఆత్మరక్షణ కారణం లేకుండా, లేదా భద్రతా మండలి అనుమతి లేకుండా సైనిక బలాన్ని ఉపయోగించకూడదు. మడురోను అరెస్ట్ చేయడం న్యాయ చర్య, ఆత్మరక్షణ కాదు. 1989 పనామా దాడిని కూడా ఐరాస భద్రతా మండలి ఖండించింది. ఆ తీర్మానాన్ని అమెరికా వెటో చేసినా, ఐరాస సర్వసభ్య సమావేశం దానిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా ప్రకటించింది.
అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
అమెరికా రాజ్యాంగం ప్రకారం.. దేశం ఆమోదించిన ఒప్పందాలు దేశ చట్టాల్లానే అమలులో ఉంటాయి. అధ్యక్షుడు వాటిని పాటించాల్సిన బాధ్యత ఉంది. కానీ కొంతమంది ప్రభుత్వ న్యాయవాదులు, కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ చట్టాలను పక్కనపెట్టి అధ్యక్షుడు చర్యలు తీసుకోవచ్చని వాదించారు. పనామా దాడి సమయంలో న్యాయ శాఖ ఇచ్చిన అభిప్రాయం కూడా ఇదే. ఆ అభిప్రాయాన్ని అప్పటి న్యాయవాదులు తయారు చేయగా, భవిష్యత్తులో అటార్నీ జనరల్ అయిన విలియం బార్ సంతకం చేశారు. అయితే ఆ వాదనపై అనేక న్యాయ నిపుణులు తీవ్ర విమర్శలు చేశారు. ఐరాస చార్టర్‌ను అధ్యక్షుడు తప్పనిసరిగా పాటించాలా అనే విషయంలో ఇప్పటివరకు అమెరికా సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. అందుకే ఈ అంశం ఇంకా చట్టపరమైన అయోమయంలోనే ఉంది.