NTV Telugu Site icon

IRE vs IND: నేడే ఐర్లాండ్‌తో తొలి టీ20.. అందరి కళ్లు అతడిపైనే!

Bumrah Ground

Bumrah Ground

Ireland vs India 1st T20I Preview and Playing 11: వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ ఓడిన భారత్.. మరో టీ20 క్రికెట్‌ సమరానికి సిద్ధమైంది. ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు తొలి పోరు జరుగనుంది. పసికూన ఐర్లాండ్‌ సిరీస్ ద్వారా సత్తా నిరూపించుకునేందుకు భారత కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశాలు టీమిండియాకు మెండుగా ఉన్నాయి. మరోవైపు యువ భారత జట్టుపై గెలిచేందుకు ఐర్లాండ్‌కు కూడా అవకాశం ఉంది. దాంతో సిరీస్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. డబ్లిన్‌లో శుక్రవారం రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వెన్నెముక గాయం, శస్త్రచికిత్స కారణంగా 11 నెలలుగా బరిలోకే దిగని బుమ్రా నేడు మైదానంలోకి దిగనున్నాడు. ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్న బుమ్రా.. ఐర్లాండ్‌తో సిరీస్‌లో ఎలా బౌలింగ్‌ చేస్తాడన్నది కీలకం. ఫిట్‌నెస్‌, బౌలింగ్‌ లయకు ఈ సిరీస్‌ అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఆసియా కప్‌ 2023, ప్రపంచకప్‌ 2023 నేపథ్యంలో ఫిట్‌నెస్‌ నిరూపించుకునేందుకు బుమ్రాకు ఇది మంచి అవకాశం. మెగా టోర్నీల నేపథ్యంలో బుమ్రా బౌలింగ్‌పై జట్టు మేనేజ్‌మెంట్‌, సెలక్టర్లు ఓ కన్నేసి ఉంచుతారు.

వెస్టిండీస్‌తో సిరీస్‌లో విఫలమయిన వికెట్‌ కీపర్‌ సంజు శాంసన్‌కు ఈ సిరీస్‌ ద్వారా చివరి అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్‌ చూస్తోందని సమాచారం. ఇదే జరిగితే అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న జితేశ్‌ శర్మకు నిరాశ తప్పదు. ఐపీఎల్ స్టార్ రింకు సింగ్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశముంది. విండీస్‌తో సిరీస్‌తో అరంగేట్రం చేసిన హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మ ఈ సిరీస్‌లోనూ సత్తాచాటితే.. ప్రపంచకప్‌ 2023 జట్టు పోటీలోకి వచ్చే అవకాశముంది. పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ, ఆల్‌రౌండర్లు శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌ పునరాగమనం చేయనున్నారు.

Also Read: Woman on Car Bonnet: పట్టపగలే దారుణం.. కారు బానెట్‌పై యువతిని అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌! వీడియో వైరల్

‘ది విలేజ్‌’ మలహైడ్‌ క్రికెట్‌ క్లబ్‌ మైదానంలోని పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. స్పిన్నర్లకు సహకారం ఉంటుంది. ఇక్కడ మొదట బ్యాటింగ్‌ చేసిన మూడు టీ20ల్లోనూ భారత్ 205కు పైగా పరుగులు చేసింది. ఐర్లాండ్‌తో ఇప్పటివరకూ ఆడిన 5 టీ20ల్లోనూ భారత్‌ గెలిచింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉన్నాయి.

తుది జట్లు (అంచనా):
భారత్‌: రుతురాజ్‌, యశస్వి, తిలక్‌, రింకు సింగ్‌, శాంసన్‌, దూబె, సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌, బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ.
ఐర్లాండ్‌: బల్‌బర్నీ, స్టిర్లింగ్‌, టకర్‌, టెక్టార్‌, కర్టీస్‌ కాంఫర్‌, ఫియాన్‌ హ్యాండ్‌, డాక్‌రెల్‌, మార్క్‌ అడైర్‌, మెకర్థీ, జోష్‌ లిటిల్‌, బెంజమిన్‌ వైట్‌.