టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ అనారోగ్యానికి గురయ్యాడు. 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూనే.. జట్టు కోసం బ్యాటింగ్ చేసిన శార్దూల్‌ను మ్యాచ్ అనంతరం ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ లక్నోలోని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. శార్దూల్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. 2024 ఇరానీ కప్ టోర్నీలో శార్దూల్ ముంబై జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
ఇరానీ కప్ పోరులో ముంబై, రెస్టాఫ్ ఇండియా టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 1న మ్యాచ్ ఆరంభం అయింది. రెస్టాఫ్ ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై మొదటి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ముగిసేసరికి 138 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 536 రన్స్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (221 నాటౌట్; 276 బంతుల్లో 25×4, 4×6) డబుల్ సెంచరీ బాదాడు. ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ సాధించిన మొదటి ముంబై ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
Also Read: Rishabh Pant: పంత్‌ను రిటైన్ చేసుకుంటాం: పార్థ్ జిందాల్
ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ తొలి రోజే అనారోగ్యంతో కన్పించాడు. అయినప్పటికీ రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి శార్దూల్ (36; 59 బంతుల్లో 4×4, 1×6) జట్టుకు భారీ స్కోరు అందించాడు. 102 డిగ్రీల జ్వరంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ.. జట్టు కోసం బ్యాటింగ్ కొనసాగించాడు. మ్యాచ్ అనంతరం జ్వరం మరింత ఎక్కువ కావడంతో ముంబై మేనేజ్‌మెంట్ అతడికి లక్నోలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చింది. శార్దూల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడికి మలేరియా, డెంగీ వంటి పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అతడు ఆడే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.