IPL Most Centuries: ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!

  • ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితా
  • 9 సెంచరీలతో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ
  • 7 శతకాలతో రెండో స్థానంలో జోస్ బట్లర్
  • 6 సెంచరీలతో క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ సంయుక్త మూడో స్థానం
  • 5 సెంచరీలతో సంజూ శాంసన్ నాలుగో స్థానంలో కొనసాగింపు..
Ipl Hundreds

Ipl Hundreds

IPL Most Centuries List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటేనే బ్యాటర్లకు స్వర్గధామంగా భావిస్తారు. ప్రతి సీజన్‌లో భారీ స్కోర్లు, సిక్సర్ల వర్షం, అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు అభిమానులను అలరిస్తుంటాయి. అయితే ఐపీఎల్‌ లాంటి పోటీతో కూడిన టోర్నీలో సెంచరీ చేయడం మాత్రం చాలా పెద్ద విషయం. ఒత్తిడిని తట్టుకుని భారీ ఇన్నింగ్స్ ఆడగలిగిన కొద్దిమంది బ్యాటర్లు మాత్రమే ఈ ఘనతను పదేపదే అందుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో భారత, విదేశీ స్టార్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. వీరి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఎన్నో సార్లు తమ జట్లకు విజయాలను అందించాయి. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక శతకాలు నమోదు చేసిన టాప్ బ్యాటర్లపై ఓ లుక్కేద్దాం.

సంజూ శాంసన్ (Sanju Samson):
ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఐదు సెంచరీలు నమోదు చేసిన సంజూ.. వైట్ బాల్ క్రికెట్‌లో అత్యంత నిలకడైన భారత బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 2013లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సంజూ శాంసన్.. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ 5,000కుపైగా పరుగులు సాధించాడు. అతని తొలి సెంచరీ 2017లో ఢిల్లీ తరఫున వచ్చింది. అనంతరం రాజస్థాన్, సీఎస్‌కే తరఫున కూడా శతకాలు బాదాడు.

కేఎల్ రాహుల్ (KL Rahul):
ఐపీఎల్‌లో అత్యంత విశ్వసనీయ బ్యాటర్లలో ఒకడైన కేఎల్ రాహుల్ ఆరు సెంచరీలతో క్రిస్ గేల్ తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించిన రాహుల్.. తన స్థిరమైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో కెరీర్ ప్రారంభించిన రాహుల్.. 2019లో పంజాబ్ కింగ్స్ తరఫున ముంబైపై తొలి సెంచరీ నమోదు చేశాడు. తర్వాత పంజాబ్‌కు మరో శతకం, లక్నో సూపర్ జెయింట్స్ తరఫున రెండు, ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మరో రెండు సెంచరీలు సాధించాడు. తాజాగా అతను ఆడిన అజేయ 152 పరుగుల భారీ ఇన్నింగ్స్ నమోదయ్యింది.

క్రిస్ గేల్ (Chris Gayle):
ఐపీఎల్ రికార్డుల గురించి మాట్లాడితే క్రిస్ గేల్ పేరు తప్పక ఉంటుంది. టోర్నీ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన గేల్.. ఆరు సెంచరీలతో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. గేల్ మొదట కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడినా.. అతని అసలైన విధ్వంసం మాత్రం ఆర్సీబీ జట్టులోనే కనిపించింది. 2011లో కోల్‌కతాపై తొలి సెంచరీ సాధించిన గేల్.. ఆ తర్వాత బెంగళూరు తరఫున ఐదు శతకాలు నమోదు చేశాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ తరఫున కూడా మరో సెంచరీ బాదాడు.

జోస్ బట్లర్ (Jos Buttler):
ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ విదేశీ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఏడు సెంచరీలతో అతను ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న బట్లర్.. తన అన్ని సెంచరీలను రాజస్థాన్ జట్టుకే సాధించాడు. ముఖ్యంగా 2022 సీజన్‌లో నాలుగు శతకాలు బాదిన అతని ప్రదర్శన ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ వ్యక్తిగత బ్యాటింగ్ సీజన్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

విరాట్ కోహ్లీ (Virat Kohli):
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. తొమ్మిది శతకాలతో అతను ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా నిలకడగా రాణిస్తూ ఐపీఎల్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. మొదటి ఎనిమిది సీజన్‌ల వరకు ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని కోహ్లీ.. 2016 సీజన్‌లో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఆ సీజన్‌లోనే నాలుగు సెంచరీలు బాది మొత్తం 973 పరుగులతో రికార్డు సృష్టించాడు. అనంతరం మరో ఐదు శతకాలు జోడించి ప్రస్తుతం తొమ్మిది సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గురువారం రాత్రి కోల్‌కతాపై నమోదైన అతని సెంచరీ మరోసారి అభిమానులను అలరించింది.