Delhi Capitals Retention List for IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ప్రతీ ప్రాంచైజీకి ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో ఒకరైనా అన్‌క్యాప్డ్ ప్లేయర్ (జాతీయ జట్టుకు ఆడని ఆటగాడు) ఉండాలి. విదేశీ ఆటగాళ్లపై బీసీసీఐ ఎలాంటి పరిమితి విధించలేదు. అయితే తొలి ఐదుగురు ఆటగాళ్లకు కలిపి గరిష్ట పరిమితి రూ.75 కోట్లుగా నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి తమకు నచ్చిన విధంగా ఖర్చు చేసుకునే అవకాశం ఫ్రాంచైజీలకు ఉంది. ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచింది.
ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించడానికి అక్టోబర్ 31ని బీసీసీఐ డెడ్‌లైన్‌గా విధించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ తాము రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఇప్పటికే బీసీసీఐకి సమర్పించినట్లు ఓ ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ పేర్కొంది. కెప్టెన్ రిషబ్ పంత్‌ని రూ.18 కోట్లు, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను రూ.14 కోట్లు, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంటుందని సమాచారం. గత సీజన్‌లో రాణించిన విదేశీ ప్లేయర్స్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ట్రిస్టన్ స్టబ్స్‌లను ఆర్‌టీఎం ద్వారా తీసుకోవాలని భావిస్తోందట.
Also Read: IPL Auction 2025: క్లాసెన్‌కు 23 కోట్లు.. హైదరాబాద్ రిటెన్షన్ లిస్ట్ ఇదే!
ఇక ఓపెనర్ పృథ్వీ షాను ఐపీఎల్ 2025 వేలంలోకి వదిలేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైందట. 2018 నుంచి ఢిల్లీకి ఆడుతున్న షా.. ఐపీఎల్ 2024లో పూర్తిగా విఫలమయ్యాడు. చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. దాంతో అతనిపై వేటు వేసేందుకు ఢిల్లీ మేనేజ్‌మెంట్ సిద్దమైందని తెలుస్తోంది. అక్టోబర్ 31 లోపు పూర్తి వివరాలు తెలియరానున్నాయి.