IPL 2026 ప్లేఆఫ్స్ ఖరారు.. రెండవసారి ఛాంపియన్ కాబోయే జట్టు ఏది.?

Ipl 2026

Ipl 2026

IPL 2026 Champion: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ లీగ్ స్టేజి ముగిసింది. దీనితో ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లు ఖరారయ్యాయి. మే 24న జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ చివరి ప్లేఆఫ్ బెర్త్‌ను దక్కించుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లతో కలిసి రాజస్థాన్ కూడా టైటిల్ రేసుకు సిద్ధమైంది.

అయితే ఇక్కడే అసలు మజా ఉంది. ఈ సీజన్ లో ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లను గమనించారా..! హా తెలుసు కానీ, ఏంటి అని అనుకుంటున్నారా..? ఇప్పటి వరకు ఈ 4 జట్లు కేవలం ఒక్కసారి మాత్రమే ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నాయి. కాబట్టి ఈసారి ఐపీఎల్‌కు కొత్త మల్టీ టైమ్ చాంపియన్ దొరకడం ఖాయంగా మారింది. డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ (RCB) లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. 2022 విజేత గుజరాత్ టైటాన్స్ (GT) నాలుగోసారి ప్లేఆఫ్స్‌ లోకి అడుగుపెట్టింది. 2016లో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరోసారి ట్రోఫీపై కన్నేసింది. ఇక షేన్ వార్న్ నాయకత్వంలో 2008లో తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ (RR) రెండో కప్పు కోసం పోరాడుతోంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ చరిత్రలో 11వసారి టాప్-4లో నిలిచి మరో రికార్డు నమోదు చేసింది. ఈ ఘనతలో ముంబై ఇండియన్స్‌తో సమంగా నిలిచిన ఆర్సీబీ, అత్యధిక ప్లేఆఫ్ అర్హతలు సాధించిన జట్ల జాబితాలో రెండో స్థానాన్ని పంచుకుంది. 12 సార్లు ప్లేఆఫ్స్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో ఉంది.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్లు:
* చెన్నై సూపర్ కింగ్స్ – 12
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 11
* ముంబై ఇండియన్స్ – 11
* సన్‌రైజర్స్ హైదరాబాద్ – 8
* కోల్‌కతా నైట్ రైడర్స్ – 8
* రాజస్థాన్ రాయల్స్ – 7
* ఢిల్లీ క్యాపిటల్స్ – 6
* గుజరాత్ టైటాన్స్ – 4

మే 26 నుంచి ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ మొదలు కానున్నాయి. తొలి క్వాలిఫైయర్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాత మే 27న ముల్లన్‌పూర్‌ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌ తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. మే 29న అదే వేదికపై క్వాలిఫైయర్-2 నిర్వహించనుండగా, మే 31న అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.